Mahaa Daily Exclusive

  సర్ కు వ్యతిరేకంగా.. నిరసనలతో హోరెత్తిన ఢిల్లీ…

Share

  • సర్ కు వ్యతిరేకంగా
  • నిరసనలతో హోరెత్తిన ఢిల్లీ
  • ఈసీఐ కార్యాలయం ముట్టడికి నిరసనకారుల యత్నం

న్యూఢిల్లీ, మహా : ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌) విధానానికి వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఓటర్ల పేర్ల అక్రమ తొలగింపును నిరసిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తూ సెంట్రల్ ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీగా తరలివెళ్లారు.

‘పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్’ ఢిల్లీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు, యువకులు, రైతులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలు, బ్యానర్లు చేతబూని నిరసన తెలిపారు. ఢిల్లీతో పాటు హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ల నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. ఈ ఆందోళనకు క్రాంతికారి యువ సంఘటన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా నిరసనకారులు “జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి”,“ఓట్ల దొంగతనాన్ని సహించం” అంటూ హోరెత్తించారు. ఈ ప్రదర్శనలో సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కరత్‌తో పాటు ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

కాళిబారీ మార్గ్, భాయ్ వీర్ సింగ్ మార్గ్ కూడలిలోని గోల్ డాక్ ఖానా సమీపంలో ప్రారంభమైన ఈ యాత్ర ఈసీఐ ప్రధాన కార్యాలయం వైపు సాగింది. అయితే, మార్గమధ్యంలో పోలీసులు నిరసనకారులను బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి ‘ప్రజా పార్లమెంట్’ నిర్వహించారు. ఈ నిరసనపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “నిరసన ప్రారంభమైంది. ఓటు వేసే ప్రాథమిక హక్కును, దానికి వ్యతిరేకంగా ప్రశ్నించే హక్కును మేము ఎప్పటికీ వదులుకోము. మనది ప్రజాస్వామ్య దేశం.. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని సజీవంగా కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటాం” అని స్పష్టం చేసింది.