Mahaa Daily Exclusive

  23 పురపాలకల్లోనూ ఎన్నికల నగారాకు సన్నాహాలు.

Share

  •  ఓటర్ల గుర్తింపునకు పురపాలక శాఖ ప్రత్యేక షెడ్యూల్ విడుదల!

అమరావతి, మహా:

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంటున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న 100 పట్టణ స్థానిక సంస్థలతో పాటు, కోర్టు వివాదాల కారణంగా ఎన్నికలు నిలిచిపోయిన మిగిలిన 23 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లోనూ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ముందస్తు కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు అవసరమైన ఓటర్ల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నాడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఐదు రోజుల ప్రత్యేక షెడ్యూల్‌తో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది.

నవంబర్ 1న 100 స్థానాల్లో పోలింగ్.. 3న కౌంటింగ్.

రాష్ట్రంలో తొలి విడతగా 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అక్టోబర్ 21న ఉపసంహరణ ప్రక్రియలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలుపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) షెడ్యూల్‌ను సవరించింది. కడప కార్పొరేషన్‌లోని 11 డివిజన్లు, తిరుపతి కార్పొరేషన్‌లోని 18 డివిజన్లు, రాజంపేట మున్సిపాలిటీలోని 11 వార్డులు, మైదుకూరు మున్సిపాలిటీలోని 32 వార్డులు కలిపి మొత్తం 72 వార్డులు, డివిజన్లలో నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల కోసం అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్తగా నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 25న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రచురిస్తారు. సిరిమాను ఉత్సవం కారణంగా గతంలో తేదీ మారిన విజయనగరం కార్పొరేషన్‌తో సహా మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన చోట నవంబర్ 2న రీపోలింగ్ జరిపి, నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు కేసులున్న 23 పట్టణ స్థానిక సంస్థలపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 100 సంస్థలు కాకుండా రాష్ట్రంలోని మరో 23 పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈ జాబితాలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు ఆముదాలవలస, రాజాం, భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, తాడిగడప, గుడివాడ, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, కందుకూరు, పొదిలి, అల్లూరు, నెల్లూరు జిల్లా గూడూరు, కావలి, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతున్నప్పటికీ, పరిపాలనాపరమైన ముందస్తు ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఓటర్ల కుల గణన, వర్గాల వారీగా గుర్తింపు, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను తక్షణమే పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ రంగంలోకి దిగింది.

అక్టోబర్ 25 నుంచి 29 వరకు ఐదు రోజుల పాటు ఇంటింటి సర్వే.

కోర్టు కేసుల్లో ఉన్న ఈ 23 పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను శాస్త్రీయంగా ఖరారు చేసేందుకు ఐదు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. పురపాలక శాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 25, 26 తేదీల్లో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను ప్రత్యక్షంగా గుర్తిస్తారు. ఈ సర్వే ఆధారంగా అక్టోబర్ 27వ తేదీన గుర్తించిన ఓటర్ల వివరాలతో వార్డుల వారీగా ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాలను అధికారికంగా ప్రచురిస్తారు. అనంతరం అక్టోబర్ 28న ముసాయిదా జాబితాలపై ప్రజలు, రాజకీయ పక్షాల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 29వ తేదీన ఆయా క్లెయిమ్స్, అభ్యంతరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి, తుది ఓటర్ల జాబితాలను ప్రచురిస్తారు.

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల షెడ్యూల్:

అక్టోబర్ 29 నాటికి తుది ఓటర్ల జాబితాలు సిద్ధం కానుండటంతో, ఆ వెంటనే ఆయా వార్డులు, డివిజన్లు, చైర్‌పర్సన్, మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వెలువడగానే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ 23 పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి పోలింగ్ నిర్వహించనుంది. మరోవైపు రాష్ట్రంలో నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు జరగనుండగా, నవంబర్ 26 నుంచి మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.