Mahaa Daily Exclusive

  మత్తు మందుల అక్రమ విక్రయాలపై ‘టీజీ సేఫ్’ ఉక్కుపాదం…

Share

మత్తు మందుల అక్రమ విక్రయాలపై ‘టీజీ సేఫ్’ ఉక్కుపాదం.
* 125 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు.
* హైదరాబాద్ ‘క్యూర్’ పరిధిలో విస్తృత తనిఖీలు..
హైదరాబాద్, మహా.
తెలంగాణలో మత్తు మందులు మరియు హానికరమైన ఔషధాల అక్రమ విక్రయాలపై ‘టీజీ సేఫ్’ డ్రగ్స్ వింగ్ అధికారులు తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ ‘క్యూర్’ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపులపై కఠిన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో అలవాటుగా మారే హానికరమైన మత్తు పదార్థాలు మరియు ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయాలపై నిఘా పెట్టిన అధికారులు.. గాజులరామారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కాప్రా, హబ్సిగూడ, ఉప్పల్‌తో పాటు జీడిమెట్ల, బాలానగర్, మేడిపల్లి, షామీర్‌పేట్ జోన్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులను విక్రయించడం, కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి అంశాలపై ఆరా తీశారు. ఫార్మసిస్టుల పర్యవేక్షణ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విస్తృత తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన మెడికల్ షాపులను అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న సుమారు 125 మెడికల్ షాపుల నిర్వాహకులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన షాపుల లైసెన్సుల సస్పెన్షన్ మరియు రద్దు కోసం శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి అక్రమ దందాలపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.