Mahaa Daily Exclusive

  ‘కర్ణాటకలో కన్నడిగుడే సార్వభౌముడు’..

Share

‘కర్ణాటకలో కన్నడిగుడే సార్వభౌముడు’.
* ఉద్యోగాల్లో భాషా వివక్షపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర హెచ్చరిక!
బెంగళూరు, మహా.
బెంగళూరులోని కొన్ని విద్యాసంస్థలు, ప్రైవేటు ఐటీ కంపెనీలు స్థానిక కన్నడిగులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాయనే ఆరోపణలు కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ‘కర్ణాటకలో కన్నడిగుడే సార్వభౌముడు’ అని స్పష్టం చేసిన ప్రభుత్వం, కన్నడ భాష మాట్లాడే స్థానిక అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలు నిరాకరిస్తే ప్రైవేటు సంస్థలపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో నియామకాల ప్రక్రియ సమయంలో భాషా ప్రాతిపదికన తీవ్రమైన వివక్ష చూపుతున్నారంటూ ఒక యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంటర్వ్యూలు లేదా షార్ట్‌లిస్టింగ్ దశలోనే తమ మాతృభాష ‘కన్నడ’ అని చెప్పిన అభ్యర్థులను కంపెనీలు తిరస్కరిస్తున్నాయని ఆ యువతి తన వీడియోలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా, తక్కువ జీతాలకు పనిచేయించుకోవడానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు, తమిళ భాషా అభ్యర్థులకే కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. బెంగళూరులోని స్థానిక కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని, ఈ ప్రాంతీయ వివక్ష సమస్యకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలని విన్నవించారు. ఈ వివాదాస్పద అంశంపై ప్రముఖ కన్నడ ఉద్యమకారుడు రూకేష్ రాజన్న కూడా స్పందించి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ పరిణామాలపై స్పందించిన నేత డికే శివకుమార్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టారు. ప్రైవేట్ సంస్థలు కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కన్నడిగుల హక్కులు, ఆత్మగౌరవం, ఉపాధి అవకాశాలను తక్కువ చేయడానికి ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ప్రపంచం బెంగళూరును భారతదేశపు ఐటీ రాజధానిగా చూస్తోందని, ఇక్కడి కన్నడిగుల అద్భుతమైన నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభుత్వానికి ఎంతో గర్వంగా ఉందని ఆయన కొనియాడారు.
మరోవైపు, ఈ అంశంపై ప్రతిపక్ష బీజేపీ అధికార ప్రతినిధి అశోక్ గౌడ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రైవేటు రంగంలో స్థానిక కన్నడిగులను ప్రోత్సహించేలా, కొత్త ఉద్యోగాల సృష్టిపై శివకుమార్ ప్రభుత్వం నిర్దిష్టమైన, సమర్థవంతమైన ప్రణాళికను వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.