‘సేవ్ ది వోట్ – సేవ్ ది కంట్రీ’ నినాదంతో దిల్లీలో మెగా ర్యాలీ.
• ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా పెద్దసంఖ్యలో తరలిరావాలి.
* లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పిలుపు!
న్యూఢిల్లీ, మహా.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ఓటు హక్కును కాపాడే లక్ష్యంతో ‘సేవ్ ది వోట్ – సేవ్ ది కంట్రీ’ నినాదంతో నవంబర్ 1న దిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో భారీ ‘జన్ మార్చ్ అండ్ మెగా ర్యాలీ’ని నిర్వహించనున్నట్లు లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన అధికారికంగా వెల్లడిస్తూ, దేశ ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ చారిత్రాత్మక ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళం విప్పాలని రాహుల్ గాంధీ కోరారు. దేశంలో అధికారంలో ఉన్నవారు ఓటర్ల జాబితాల నుంచి పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారని, రాజ్యాంగ నిబంధనలను, చట్టాలను నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై లాఠీలతో దాడులు చేస్తూ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. “ఓటు మీది.. పోరాటం కూడా మీదే” అని ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన, రాబోయే ఏడు రోజుల పాటు ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించాలని సూచించారు.
ఇదే సమయంలో తమ విమర్శలు, చర్యల ద్వారా ఈ కార్యక్రమానికి పరోక్షంగా మరింత ప్రజా ప్రచారం కల్పిస్తున్నందుకు బీజేపీకి రాహుల్ గాంధీ వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ మెగా ర్యాలీ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నవంబర్ 1న జరగనున్న ఈ మహా ప్రదర్శనకు దేశ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






