వారణాసిలో అంబరాన్ని అంటిన వైమానిక విన్యాసాలు.
* గంగాతీరంలో గర్జించిన రఫేల్, తేజస్ యుద్ధవిమానాలు!
* ప్రధాని మోదీ సమక్షంలో కనులవిందుగా ‘వింగ్స్ ఓవర్ గంగా’ ప్రదర్శన.
* మహిళలకు ఉపాధి కల్పించేలా నూతన వస్త్ర పరిశ్రమ ప్రారంభం!
వారణాసి,మహా.
పవిత్ర గంగానది తీరం యుద్ధవిమానాల గర్జనలతో మార్మోగింది. ఆకాశంలో మెరుపువేగంతో దూసుకెళ్లిన అత్యాధునిక యుద్ధవిమానాలు, క్రమశిక్షణతో సాగిన హెలికాప్టర్ల విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచాయి. భారత వైమానిక దళ 94వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని వారణాసి నమో ఘాట్ వద్ద నిర్వహించిన ‘వింగ్స్ ఓవర్ గంగా’ వైమానిక ప్రదర్శన దేశ రక్షణ సామర్థ్యానికి అద్దం పట్టింది. ఈ అద్భుత వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
గగనతలంలో భారత వైమానిక దళానికి చెందిన ‘సూర్యకిరణ్’ విన్యాస బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు రంగుల విమానాలు అత్యంత సమన్వయంతో ఆకాశంలో దూసుకెళ్లిన దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే ‘సారంగ్’ హెలికాప్టర్ ప్రదర్శన బృందం చేసిన విన్యాసాలు కార్యక్రమానికి మరింత శోభను తెచ్చాయి. గంగానది నేపథ్యంగా నిర్వహించిన ఈ ప్రదర్శనలో పైలట్ల అసాధారణ నైపుణ్యం, విమానాల కచ్చితమైన నియంత్రణ, బృందాల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ తేలికపాటి యుద్ధవిమానంతో పాటు సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్ యుద్ధవిమానాలు, ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు తమ విన్యాసాలతో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. చేతక్, చినూక్ హెలికాప్టర్లు, రవాణా విమానాలు కూడా ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి. త్రివిధ దళాల సంయుక్త సామర్థ్యాన్ని చాటిచెప్పేలా రూపొందించిన ఈ కార్యక్రమం దేశ సైనిక విమానయాన రంగ వైవిధ్యాన్ని ప్రతిబింబించింది.
ఈ వైమానిక ప్రదర్శనతో పాటు వారణాసిలో పారిశ్రామికాభివృద్ధి, మహిళా సాధికారత దిశగా మరో కీలక అడుగు పడింది. వైమానిక ప్రదర్శనకు హాజరయ్యే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని మీర్జామురాద్ ప్రాంతంలో అరవింద్ లిమిటెడ్ నూతన దుస్తుల తయారీ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ వందలాది మంది మహిళలకు నియమించి శిక్షణ ఇస్తుండగా, భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యం పెరిగే కొద్దీ మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. నూతన తయారీ కేంద్రంలో ఆధునిక పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ మార్కెట్లకు సరిపోయేలా దుస్తులను తయారు చేయనున్నారు. పరిశ్రమను సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ పనిచేస్తున్న మహిళలతో ముచ్చటించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. రక్షణ రంగ పరాక్రమాన్ని చాటే వైమానిక విన్యాసాలు, మహిళల ఉపాధిని ప్రోత్సహించే పారిశ్రామిక ప్రాజెక్టులతో వారణాసి పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.






