పంజాబ్ ‘త్రింజన్’ సంప్రదాయానికి కొత్త ఊపిరి.
* మహిళల చేనేత ప్రతిభను కొనియాడిన ప్రధాని మోదీ.
* సేంద్రియ పత్తి సాగు నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు గ్రామీణ మహిళల స్వయం ఉపాధి బాట.
* మన్ కీ బాత్’లో ప్రత్యేక ప్రస్తావన.
న్యూఢిల్లీ, మహా.
భారతీయ గ్రామీణ సంప్రదాయాలకు పునరుజ్జీవం కల్పిస్తూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలుస్తున్న పంజాబ్‌లోని ‘నవ్-త్రింజన్’ సేంద్రియ పత్తి మరియు చేనేత ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 139వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా ప్రస్తావించి, ఇక్కడ శ్రమిస్తున్న గ్రామీణ మహిళల కృషిని అభినందించారు. సంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ మహిళలు సాధిస్తున్న విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
పంజాబ్ గ్రామీణ సంస్కృతిలో ‘త్రింజన్’కు ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో గ్రామీణ మహిళలంతా ఒకచోట చేరి చరఖాలతో పత్తిని నూలుగా వడుకుతూ, జానపద గీతాలు పాడుకుంటూ తమ అనుభవాలను పంచుకునేవారు. ఇది కేవలం నూలు వడికే వేదిక మాత్రమే కాకుండా, మహిళల మధ్య ఐక్యతను, సాంస్కృతిక బంధాలను పెంపొందించే గొప్ప వ్యవస్థ. అయితే కాలక్రమంలో పారిశ్రామికీకరణ, యంత్రాల వాడకం పెరగడంతో ఈ అద్భుతమైన సంప్రదాయం కనుమరుగైంది. ఆ చారిత్రక వారసత్వాన్ని ఆధునిక కాలానికి తగినట్లుగా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ‘ఖేతి విరాసత్ మిషన్’ ఆధ్వర్యంలో పంజాబ్‌లోని ఫరీద్కోట్ జిల్లా జైటో ప్రాంతంలో ‘నవ్-త్రింజన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాజెక్టు ద్వారా పత్తి సాగు నుంచి తుది వస్త్రం తయారీ వరకు ప్రతి దశను అత్యంత సమర్థవంతంగా అనుసంధానిస్తున్నారు. స్థానిక రైతులు దేశీయ పత్తి విత్తనాలతో పూర్తిగా సహజ, సేంద్రియ పద్ధతుల్లో పత్తిని పండిస్తుండగా.. మహిళలు చరఖాలపై నూలు వడకడం, చేనేత మగ్గాలపై సహజ రంగులను ఉపయోగిస్తూ ఆకర్షణీయమైన వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడంతో పాటు, నూలు వడికేవారు, నేత పనివారు, రంగులు అద్దేవారు ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. నవ్-త్రింజన్ నేత పాఠశాల ద్వారా యువతీయువకులకు, గ్రామీణ మహిళలకు నిపుణులైన కళాకారులు శిక్షణనిస్తూ ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందిస్తున్నారు.
గతంలో సాధారణ కూలీలుగా పనిచేసిన రమణ్‌దీప్ కౌర్, రజనీ కౌర్ వంటి ఎంతోమంది మహిళలు ఈ ప్రాజెక్టు ద్వారా నైపుణ్యం కలిగిన నేత కార్మికులుగా ఎదిగి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా రేఖా రాణి అనే మహిళా కళాకారిణి తన చేతితో స్వయంగా నేసిన ప్రత్యేక శాలువాను భారత రాష్ట్రపతికి బహూకరించడం ఈ ప్రాజెక్టు సాధించిన గొప్ప ఘనతగా నిలిచింది. పర్యావరణ హితమైన సేంద్రియ పత్తితో, రసాయన రహిత రంగులతో తయారవుతున్న ఈ చేనేత ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో విశేష స్పందన లభిస్తోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రాజెక్టు నిర్వాహకులు ప్రధాని మోదీని కలిసి తాము తయారు చేసిన స్వదేశీ వస్త్రాలను ప్రదర్శించారు. తాజాగా ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును ప్రశంసించడం ద్వారా పంజాబ్ గ్రామీణ మహిళల చేనేత ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఏర్పడింది.






