Mahaa Daily Exclusive

  ‘వసుధైవ కుటుంబకం’ కేవలం మాటల్లో కాదు.. ఆచరణలో చూపిస్తున్నాం… కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్

Share

న్యూఢిల్లీ, మహా.

ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ప్రఖ్యాత భారత్ మంటపంలో నిర్వహించిన ‘చిన్మయ అమృత్ మహోత్సవ్’ గ్లోబల్ సమ్మేళనంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ అనుసరిస్తున్న విదేశీ విధానం, ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) సిద్ధాంతాన్ని దేశం ఎలా ఆచరణలో పెడుతుందో ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక చర్యలతో ప్రపంచ దేశాల మన్ననలు పొందుతున్నామని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారి విలయం సృష్టించిన క్లిష్ట సమయంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నప్పటికీ, ఇతర వెనుకబడిన దేశాలకు కూడా టీకాలను అందించి భారత్ తన పెద్ద మనసు చాటుకుందని జైశంకర్ గుర్తుచేశారు. కేవలం టీకాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలలో వందలాది అభివృద్ధి ప్రాజెక్టులను భారత్ నేడు విజయవంతంగా నిర్వహిస్తోందని, శిక్షణ, సామర్థ్య నిర్మాణ సంస్థలలో ఇతర దేశాలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. నేపాల్, శ్రీలంక, వెనిజులా లేదా జమైకా వంటి దేశాల్లో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు భారత్ ఎప్పుడూ ముందుండి స్పందించి ఆదుకుంటోందని ఆయన వివరించారు.
ప్రపంచంలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ వాతావరణంపై జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియా ప్రాంతాల్లో జరుగుతున్న రెండు ప్రధాన యుద్ధాల ప్రభావం నేరుగా సంబంధం లేని అనేక దేశాలపై, వాటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై మనం మూగప్రేక్షకులుగా మిగిలిపోలేమని స్పష్టం చేస్తూ, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలు మాత్రమే ఏకైక మార్గమని భారత్ బలంగా విశ్వసిస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకతను ఆయన గట్టిగా నొక్కిచెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి బలహీనతలను, పరిమితులను గుర్తించి తక్షణమే మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని జైశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో కీలక భాగమైన దేశాలను పక్కనబెట్టలేమని, సంక్షోభాల వేళ ఐక్యరాజ్యసమితి ప్రేక్షక పాత్ర పోషించకుండా నిజమైన నాయకత్వాన్ని వహించాలని ఆయన హితవు పలికారు.