Mahaa Daily Exclusive

  విమానాశ్రయంలో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత….

Share

విమానాశ్రయంలో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత.
• సింగపూర్ నుంచి వస్తున్న ప్రయాణికుడి అరెస్ట్.
• బ్యాంకాక్ నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించిన విశాఖ డీఆర్‌ఐ అధికారులు!
భోగాపురం,మహా.

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్‌) అంతర్జాతీయ విమానాశ్రయంలో విశాఖపట్నం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం మెరుపు తనిఖీలు చేపట్టారు. ముందస్తు పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కోల్‌కతాకు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా..
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (36) అనే నిందితుడు బ్యాంకాక్‌లో గంజాయిని సేకరించాడు. అక్కడి నుంచి సింగపూర్ మీదుగా ‘స్కూట్’ విమానంలో ఏఎస్‌ఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ముందస్తు సమాచారం ఉన్న డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుడి వద్ద సుమారు 4 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక వాతావరణంలో సాగు.. దర్యాప్తు ముమ్మరం:
సాధారణ మట్టి లేకుండా, నియంత్రిత కృత్రిమ వాతావరణంలో అత్యాధునిక పద్ధతిలో సాగు చేసే ఈ హైడ్రోపోనిక్ గంజాయికి బ్యాంకాక్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు సుమారు రూ.30 వేల వరకు ధర ఉన్నట్లు సమాచారం.