Mahaa Daily Exclusive

  విదేశాల్లో భారతీయులు ఎప్పుడూ అల్లర్లకు దిగరు…

Share

విదేశాల్లో భారతీయులు ఎప్పుడూ అల్లర్లకు దిగరు.
* శాంతియుతంగా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
* కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు!

బెర్లిన్, మహా.

విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయలు (ఎన్నారైలు) ఎప్పుడూ ఎలాంటి అల్లర్లకు పాల్పడరని, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసే సంస్కృతి భారతీయులది కాదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్‌లో జరిగిన ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విదేశాల్లోని మన వారు తమ సత్ప్రవర్తనతో ఆయా దేశాల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారని కొనియాడారు.
వీధుల్లోకి వచ్చి అశాంతిని సృష్టించడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనులకు భారతీయులు ఎప్పుడూ పాల్పడరని ప్రపంచ దేశాలకు బాగా తెలుసని పీయూష్ గోయల్ అన్నారు. ఐరోపాలో ప్రస్తుతం మనం చూస్తున్న కొన్ని పరిణామాల మాదిరిగా భారతీయులు ఎక్కడా సమాజంలో అశాంతిని రేకెత్తించరని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ పాలకులు వలసలను ప్రోత్సహించడమే అక్కడ అల్లర్లకు కారణమని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇదే సమయంలో జర్మనీకి పైచదువుల నిమిత్తం వచ్చే సాటి భారతీయులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్థానిక ఎన్నారైలు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. కొత్త దేశానికి వచ్చే విద్యార్థులు అక్కడ పూర్తిగా కుదురుకునే వరకు వారికి తగిన మార్గదర్శకత్వం, సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. భారత్, జర్మనీ దేశాల ప్రజల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించేందుకు ఆయన ఈ రెండు రోజుల పాటు జర్మనీలో పర్యటించారు. కాగా, ప్రస్తుతం జర్మనీలో సుమారు 3.3 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా, భారత సంతతికి చెందిన జర్మన్ పౌరులు మరో 70 వేల వరకు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.