Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్‌…

Share

హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్‌.
* రూ.600లకే వీక్లీ అన్‌లిమిటెడ్ బస్ పాస్‌!
హైదరాబాద్‌, మహా.
ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, నగరంలో ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం రాకపోకలు సాగించే వారికి ఊరటనిచ్చేలా సరికొత్త ‘వీక్లీ బస్ పాస్’ పథకానికి శ్రీకారం చుట్టింది. కేవలం రూ.600ల నామమాత్రపు ధరతో వారం రోజుల పాటు నగరంలో ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా అపరిమితంగా ప్రయాణించే అద్భుతమైన వెసులుబాటును కల్పించింది.
ఈ సరికొత్త సదుపాయం ద్వారా ప్రయాణికులు గ్రేటర్ పరిధిలోని సాధారణ సిటీ బస్సులతో పాటు ఏసీ బస్సుల్లోనూ ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే, ప్రత్యేక సేవలుగా నడిచే పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు మాత్రం ఈ వీక్లీ పాస్ వర్తించదని తేల్చిచెప్పింది. వారం రోజుల పాటు పదే పదే టికెట్లు కొనుగోలు చేసే శ్రమ నుంచి ప్రయాణికులకు విముక్తి కల్పించడంతో పాటు, ఇది పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రయాణాన్ని అందిస్తుందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.
నిత్యం ఉద్యోగ, వ్యాపార పనుల నిమిత్తం తిరిగే వారితో పాటు, తాత్కాలికంగా నగరానికి వచ్చి వివిధ ప్రాంతాలు తిరిగే పర్యాకులకు ఈ వీక్లీ పాస్ అత్యంత ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సరికొత్త పాస్‌లను నగరంలోని అన్ని ప్రముఖ ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ పాస్‌ను కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచి సరిగ్గా ఏడు రోజుల పాటు ఇది చెల్లుబాటులో ఉంటుందని వెల్లడించారు. నగరవాసులు, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.