కృత్రిమ మేధతో జాబ్ మార్కెట్లో పెను మార్పులు.
* రాబోయే కాలం అత్యంత క్లిష్టం.
* బిల్ గేట్స్ హెచ్చరిక!
న్యూయార్క్,మహా.
రాబోయే రెండు దశాబ్దాల్లో కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ప్రపంచ జాబ్ మార్కెట్లో పెనుమార్పులు సంభవించనున్నాయని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. ఈ పరివర్తన కాలంలో సమాజం, శ్రామిక వర్గం అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ తర్వాతే సమాజానికి అవసరమైన అసలైన సంపదను ఏఐ సృష్టిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ ‘డీకోడర్’ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా జాబ్ మార్కెట్ భవిష్యత్తుపై పలు కీలక విషయాలను పంచుకున్నారు.
ఏఐ ద్వారా సమాజం పూర్తిగా సుసంపన్నమయ్యే లోపు కొందరు మాత్రమే విజేతలుగా మారుతుంటే, మరికొందరు నష్టపోయి విఫలమైన వారిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారాలు, పారిశ్రామిక రంగాల్లో రానున్న తీవ్ర మార్పుల కారణంగా సామాన్య ప్రజలు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కార్యాలయాల్లో ఉద్యోగాల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఏఐ వ్యవస్థలు మరింత మెరుగయ్యే కొద్దీ టెలిఫోన్ సేల్స్, కస్టమర్ సపోర్టు, అకౌంటింగ్ వంటి ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనుషుల కంటే అత్యంత కచ్చితత్వంతో, తక్కువ ఖర్చుతో ఈ పనులన్నింటినీ ఏఐ సులభంగా చక్కబెట్టేస్తుందని ఆయన వివరించారు.
ఉద్యోగాల కోతలు కేవలం ఆఫీసులకే పరిమితం కావని బిల్ గేట్స్ హెచ్చరించారు. శారీరక శ్రమ అవసరమైన పనులను మనుషులను పోలిన హ్యూమనాయిడ్ రోబోలు పూర్తి చేస్తాయని చెప్పారు. ఏఐ, రోబోటిక్స్ అభివృద్ధి వేగానికి భారీ స్థాయిలో ఎక్కడా బ్రేకులు పడని పక్షంలో భవిష్యత్తులో యంత్రాలే అన్నీ తానై అనేక పనులు చేసే స్థితి వస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో వైద్య రంగంలో సర్జరీలు చేయడం, వ్యవసాయ పనులు, ఇళ్ల నిర్మాణం వంటి క్లిష్టమైన రంగాల్లోనూ రోబోలు స్వయంగా పనిచేసే పరిస్థితి వస్తుందని ఆయన అంచనా వేశారు.








