- తాడిపత్రి పీఎస్ ఎదుట
- జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన
- మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి, మహా : అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. తిమ్మంపల్లి గ్రామంలో టీడీపీ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ, అందుకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ బయట రహదారిపైనే మంచం వేసుకుని పడుకుని చేపట్టిన నాటకీయ నిరసన తీవ్ర కలకలం రేపింది.
రాళ్లదాడి ఘటన – తాడిపత్రిలో పెరిగిన ఉద్రిక్తత
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాస పరిసరాల్లో రాళ్లదాడి జరిగినట్లు పరస్పర ఆరోపణల నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత వేడెక్కాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే వరకు తన నిరసనను విరమించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ అభ్యర్థిగా 37వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతుదారులతో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. 37వ వార్డు కౌన్సిలర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రి మునిసిపాలిటీలో 48 వార్డులుండగా 30 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవంగా నెగ్గింది.
గన్నేవారిపల్లి కాలనీలో వైసీపీ కార్యకర్తల ఇళ్లపై కూటమి నేతలు దాడి చేశారని ఆరోపించారు. వైసీపీ నేత ప్రదీప్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయని పార్టీ నేతలు అన్నారు. ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పోలీసులు అనంతపురానికి తరలించారు. మరోవైపు టీడీపీ కార్యకర్తను కొట్టారన్న ఆరోపణలపై పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ పరస్పరం దాడులతో రాజకీయంగా తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది.








