Mahaa Daily Exclusive

  రాప్తాడు కాల్పుల ఘటనపై హైకోర్టులో పిల్..

Share

  • రాప్తాడు కాల్పుల ఘటనపై హైకోర్టులో పిల్
  • ఆరుగురు రౌండ్ల కాల్పులపై స్వతంత్ర విచారణకు డిమాండ్‌
  • హేమంత్‌పై పోలీసుల కాల్పుల చట్టబద్ధత, అనుపాతంపై ప్రశ్నలు
  • గాయపడిన నిందితుడిని ఆస్పత్రిలోకి ఈడ్చుకెళ్లిన వ్యవహారంపైనా విచారణ కోరిన న్యాయవాది

అమరావతి, మహా : అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌ అలియాస్‌ దుమ్ముపై పోలీసులు జరిపిన కాల్పులు, అనంతరం గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించిన తీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్‌) దాఖలైంది. న్యాయవాది గుండా గోపీ కృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు అందులో పేర్కొన్న వివరాల ద్వారా తెలుస్తోంది. ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన ఘటనలో పోలీసుల చర్యల చట్టబద్ధత, అవసరం, అనుపాతాన్ని పరిశీలించాలని, సంబంధిత అధికారుల బాధ్యతను నిర్ధారించాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మరో విద్యార్థిని కూడా గాయపడినట్లు మీడియా కథనాల్లో వచ్చిన సమాచారాన్ని పిటిషనర్‌ ప్రస్తావించారు. నిందితుడిని పట్టుకునేందుకు సుమారు 25 పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అప్పట్లో పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో హేమంత్‌ అలియాస్‌ దుమ్ము అనంతపురం జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని, అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు బృందంపై నిందితుడు దాడి చేశాడని, ఆ దాడిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు గాయాలయ్యాయని మీడియా కథనాల ఆధారంగా పిటిషనర్‌ వివరించారు. పోలీసుల అధికారిక వివరణ ప్రకారం మొదట గాల్లోకి కాల్పులు జరిపి, అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడైందని పేర్కొన్నారు. అయితే ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సిన అవసరం ఏమిటి? కాల్పుల సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటి? పోలీసుల చర్యలు చట్టపరమైన పరిమితులకు, అవసరమైన అనుపాతానికి అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరగాలని పిటిషనర్‌ కోరారు. నిందితుడి కాళ్లకు బుల్లెట్‌ గాయాలతో పాటు ముఖంపై కూడా గాయాలైనట్లు మీడియా కథనాల్లో వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ముఖంపై గాయాలు ఎలా ఏర్పడ్డాయి, వాటికి కాల్పులతో సంబంధం ఉందా, అటవీ ప్రాంతంలో పడిపోవడం వల్లే గాయాలయ్యాయన్న పోలీసుల వివరణలో వాస్తవమెంత అనే అంశాలను వైద్య, ఫోరెన్సిక్‌ ఆధారాలతో నిర్ధారించాలని కోరారు.

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలోకి ఈడ్చుకెళ్లిన దృశ్యాలపై అభ్యంతరం

ఈ పిటిషన్‌లో మరో కీలక అంశంగా గాయపడిన హేమంత్‌ను ఆస్పత్రికి తరలించిన తీరును ప్రస్తావించారు. మీడియా ఛానళ్లలో ప్రసారమైన దృశ్యాల్లో స్ట్రెచర్‌పై తరలించకుండా పోలీసు సిబ్బంది అతడిని నేలపై ఈడ్చుకెళ్లినట్లు కనిపించిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. తీవ్ర బుల్లెట్‌ గాయాలతో ఉన్న వ్యక్తిని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా తరలించడం వల్ల అతడి గాయాలు మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో అత్యవసర వైద్య సహాయం అందించిన విధానం, స్ట్రెచర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు ఉపయోగించలేదు, అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది మరియు ఆస్పత్రి సిబ్బంది బాధ్యత ఏమిటి అనే అంశాలపై కూడా విచారణ జరపాలని కోరారు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీ, అత్యవసర విభాగం రికార్డులు, మెడికో లీగల్‌ కేసు పత్రాలు, వైద్య నివేదికలు, ఘటనాస్థలంలో ఉన్నవారి వాంగ్మూలాలను భద్రపరచాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

ఆర్టికల్‌ 21 హక్కుల పరిరక్షణకు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

నిందితుడిపై నేరారోపణలు ఉన్నప్పటికీ, అతడి నేరాన్ని నిర్ధారించే అధికారం న్యాయస్థానానికే ఉంటుందని పిటిషనర్‌ పేర్కొన్నారు. న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యే వరకు ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు, గౌరవంగా వ్యవహరించబడే హక్కు ఉంటాయని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని వివరించారు. పోలీసుల కాల్పుల ఘటనకు సంబంధించిన వైద్య రికార్డులు, ఫోరెన్సిక్‌ ఆధారాలు, వీడియో దృశ్యాలు, ఇతర కీలక సమాచారాన్ని తక్షణమే భద్రపరచాలని పిటిషనర్‌ కోరారు. సంబంధిత పోలీసు అధికారుల పాత్రను నిష్పక్షపాతంగా పరిశీలించి, బాధ్యత నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పోలీసుల అధికారిక ప్రకటనలకే పరిమితం కాకుండా, స్వతంత్ర ఆధారాల ఆధారంగా విచారణ జరగాలని పేర్కొన్నారు.

స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని హైకోర్టును కోరిన పిటిషనర్‌

ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టేలా సంబంధిత ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ తన అభ్యర్థనలో కోరారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులు, ఎన్ని రౌండ్లు ఎలా కాల్చారు, నిందితుడికి తగిలిన గాయాల స్వభావం, ఆస్పత్రికి తరలించిన సమయంలో జరిగిన పరిణామాలు వంటి అన్ని అంశాలను దర్యాప్తులో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌కు ఆధారంగా మీడియా ప్రచురించిన ఫొటోలు, పోలీసు అధికారి మీడియాతో మాట్లాడిన దృశ్యాలు, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెబ్‌ కథనాన్ని సమర్పిస్తున్నట్లు పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా ప్రజాప్రయోజనాల దృష్ట్యా దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు.