Mahaa Daily Exclusive

  షరతులు లేకుండా క్షమాపణ చెప్పాల్సిందే…

Share

  • షరతులు లేకుండా క్షమాపణ చెప్పాల్సిందే
  • నటుడు ఇమ్రాన్‌పై హైకోర్టు ఆగ్రహం
  • సీజేపీ నిరసనలలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్
  • ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించవద్దన్న బాంబే హైకోర్టు
  • భారతీయులైతే విదేశాల్లో మరుసటి ఫ్లైట్‌కే వెనక్కి పంపేవారన్న న్యాయస్థానం

ముంబై, మహా : బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెలలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అధికారులు తనకు జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేవలం అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోదని, షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, “ఒకవేళ భారత పౌరులు విదేశాల్లో ఇలాంటి చర్యకు పాల్పడితే, మరుసటి ఫ్లైట్‌కే వారిని భారత్‌కు పంపించేవారు” అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. “ఇన్ని సంవత్సరాలుగా భారత్‌లో నివసిస్తున్న మీరు ఎప్పుడూ నిరసనల్లో పాల్గొనలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు పాల్గొన్నారు?” అని ఇమ్రాన్‌ను ప్రశ్నించింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించవద్దని హెచ్చరించింది.

ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, ఓసీఐ కార్డు హోల్డర్‌గా ఆయన హక్కులు పరిమితమని తెలిపారు. భారత పౌరులతో సమానంగా నిరసనల్లో పాల్గొనే హక్కు ఆయనకు లేదని వాదించారు. “ఇమ్రాన్‌కు ప్రజల్లో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిరసన ఉద్దేశం తెలిసి కూడా ఆయన అందులో పాల్గొన్నారు” అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, నిరసన నిర్వాహకులతో అతడికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ భారత్ లోనే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ, ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రతిపాదించారు. అయితే, కోర్టు మాత్రం క్షమాపణకే మొగ్గు చూపాలని సూచించింది.