- రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు
- తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిన టైమొచ్చింది
- చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది
- ఎస్ఐఆర్ రాకముందే మూడు సార్లు బీజేపీ గెలిచింది
- తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది
- గెలిస్తే ప్రజా తీర్పు, ఓడితే ఈవీఎంల తప్పా
- ఎస్ఐఆర్, ఈవీఎంలపై చర్చకు సిద్దమని సవాల్
- ఎంజె మార్కెట్ సభలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర హెం మంత్రి అమిత్ షా
హైదరాబాద్, మహా : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన టైం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి ఢిల్లీ వేదికగా ర్యాలీ చేశారంటూ ఎద్దేవా చేశారు. విదేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులకు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మద్దతివ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్లు తొలగించకుండానే 2019లోనూ ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారు.. అప్పుడు ఎలాంటి ఎస్ఐఆర్ ప్రక్రియ చేయలేదు కదా, అయితే అప్పుడెలా అధికారంలోకి వచ్చామని ప్రశ్నించారు. 2014లోనూ మోదీ ప్రధాని అయ్యారని.. అప్పుడు కూడా ఎలాంటి సర్ ప్రక్రియ నిర్వహించలేదన్నారు. హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – అరాచకాన్ని అంతం చేయండి’ (లోక్తంత్ర బచావో – అరాజకతా హటావో) మహాపాదయాత్ర , బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ‘భారత్ మాతాకీ జై’, ‘జైశ్రీరామ్’ నినాదాలతో తమ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, పాతబస్తీలోని శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారిని, భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. నాడు సర్దార్ పటేల్ గనుక నిజాం నిరంకుశ పాలనను లొంగదీసుకోకపోతే హైదరాబాద్, తెలంగాణ భూభాగం ఈరోజు భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి కావని నొక్కి చెప్పారు. అలాగే గిరిజన విప్లవ వీరులు కొమరం భీమ్, రామ్‌జీ గోండ్ల అమరపోరాటాలను ఈ సందర్భంగా కొనియాడారు.
‘రాహుల్ గాంధీ ఈవీఎంలను తప్పు పడుతున్నారు. చొరబాటుదారుల ఓట్లు అలాగే ఉంచమంటారా ఏంటీ? దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ అంతమైపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉంది. దేశంలో 3 కోట్ల మంది చనిపోతే వారి ఓట్లు అలాగే ఎందుకు ఉంచాలి. కొన్ని కోట్ల మంది కొత్త ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఓట్లు తీసుకుంటున్నారు. అందుకే సర్ ప్రక్రియతో సమగ్ర ఓటర్ల జాబితా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆపాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. మాక్ పార్లమెంట్లో మాత్రమే మీకు పదవులు వస్తాయి. నిజ జీవితంలో రాహుల్ గాంధీ ఎన్నిటికీ ప్రధాని కాలేరు. అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
అది ‘ఓట్ బచావో’ కాదు ‘చొరబాటుదారుల రక్షణ’ సభ
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సభపై అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నది ఓటర్ల పరిరక్షణ ర్యాలీ కాదని, ఓటర్ల జాబితాలోకి చొరబడిన అక్రమార్కులను కాపాడేందుకు ఆ పార్టీ పన్నుతున్న కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 13 కోట్ల ఓట్లు రద్దయ్యాయంటూ దొంగ ప్రచారాలు చేస్తోందని, నిజానికి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆరున్నర కోట్ల మంది ఓటర్ల పేర్లను నిబంధనల ప్రకారమే సవరించారని వివరించారు. రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఎంతగా అడ్డుపడినా, చొరబాటుదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా ఈ దేశం నుంచే వెళ్లగొడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించాలి.. తెలంగాణలో మార్పు రావాలి
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించి, అరాచక పాలనకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రజలు ఆలోచించి మద్దతు తెలపాలని ఆయన కోరారు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని.. ఆర్ఆర్ అంటే రాహుల్–రేవంత్ ట్యాక్స్ అని అమిత్ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణను ఢిల్లీ దర్బార్‌కు ఏటీఎంలా మార్చారని అమిత్ షా ఘాటుగా విమర్శించారు.
ఎస్ఐఆర్కు పూర్తి మద్దతు.. ఓటు బ్యాంకు రాజకీయాలపై ఆగ్రహం
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు. చొరబాటుదారులే కాంగ్రెస్‌కు ప్రధాన ఓటు బ్యాంకుగా మారారని, అందుకే ఈ సర్వేను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో బీజేపీ రాజీపడే ప్రసక్తే లేదని, చట్టబద్ధంగా జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. కేవలం భారతదేశానికి చెందిన అసలైన పౌరులకు మాత్రమే దేశంలో ఓటు వేసే హక్కు ఉంటుందని, దొంగ ఓటర్లను ఏమాత్రం సహించబోమని తేల్చిచెప్పారు.
పార్లమెంట్ లో చర్చకు సిద్ధం
ఎస్ఐఆర్, ఈవీఎంలపై చర్చకు సిద్దమని, దమ్ముంటే కాంగ్రెస్ అలయేన్స్ సంసిద్ధత వ్యక్తం చేయాలని అమిత్ షా సవాల్ విసిరారు. ఎన్నికల్లో ప్రజాభిమానాన్ని పొందలేని పార్టీలన్నీ ఏకమైన చట్టబద్దమైన సంస్థలు, వ్యవస్థలపై ప్రజల్లో అపోహలను కల్పిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నో ఎండ్లుగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలలో గెలవడం లేదని, ఇక నుంచి కూడా ఆ పార్టీ గెలిచేద లేదన్నారు. చనిపోయిన వారి ఓట్లను, వేర్వేరు పనులపై ఇళ్ళు, గ్రామాలు, పట్టణాలు మారిన వారి ఓట్లను తొలగించడంతో పాటు చొరబాటు దారుల ఓట్లను గుర్తించి తొలగిస్తుంటే సహించలేక కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తుందని దుయ్యబట్టారు. దమ్ముంటే లోక్ సభలో చర్చకు రావాలని, చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు తమవద్ద ఉన్న ఆధారాలను సభ ముందుంచాలని అమిత్ షా సవాల్ విసిరారు.
అంతకుముందు సాయంత్రం 4.10 గంటలకు అబిడ్స్ నిజాం కాలేజీ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద అమిత్ సా నేతృత్వంలో మొదలైన మహా పాదయాత్ర మోజంజాహి మార్కెట్ వరకు కొనసాగింది. ఢిల్లీలో కాంగ్రెస్, ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ హైదరాబాద్ వేదికగా ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం- అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. అమిత్ షా జాతీయ జెండాతో రెండు కిలోమీటర్ల మేర ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఇతర నేతలు మోజంజాహి మార్కెట్ వద్ద పాదయాత్ర ముగిసిన తరువాత అమిత్ షా కీలక ప్రసంగం చేశారు.








