- అర్నబ్‌తో పోలిస్తే మురసు తుఫాను తక్కువ తీవ్రత
- దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలకు అవకాశం
- 50 టీఎంసీల మేర వరద ప్రవాహాలు వస్తాయని అంచనా
- సమర్ధ నీటి నిర్వహణతో చెరువులు, రిజర్వాయర్లు నింపాలి
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
- మురసు తుఫాను సన్నద్ధతపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, మహా : కోస్తాంధ్ర తీరంపై మురసు తుఫాను ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అర్నబ్ తుఫానుతో పోలిస్తే గాలులు, వర్ష తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్టు అంచనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావంతో వచ్చే వర్షాలను సమర్థంగా వినియోగించుకుని చెరువులు, రిజర్వాయర్లను నింపాలని సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం తెలిపారు. అర్నబ్ ప్రభావాన్ని ఎదుర్కొనేలా శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ముందస్తు ఏర్పాట్లు చేశామని, ఇప్పుడు మురసు తుఫాను ప్రభావాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. అర్నబ్ తుఫాను కారణంగా శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి పంపించామని అధికారులు వివరించారు. మురసు తుఫాను గాలుల ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలపై పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం చెన్నై నుంచి మరో వెయ్యి మంది సిబ్బంది వస్తున్నారని, వారిని నెల్లూరు, ప్రకాశం సహా వివిధ జిల్లాల్లో వినియోగించాలని సీఎం సూచించారు.
పల్నాడులో అత్యధిక వర్షపాతం అంచనా
మురసు తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో 30 సెంటీమీటర్లు, ప్రకాశంలో 24, మార్కాపురంలో 19, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఏలూరులో 9 సెం.మీ., నెల్లూరులో 9 సెం.మీ. మేర వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో డ్రెయిన్లను ముందుగానే శుభ్రం చేయాలని, వాగులు, వంకలు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 30 టీఎంసీల నుంచి 50 టీఎంసీల వరకు నీటి ప్రవాహాలు రావచ్చని అధికారులు అంచనా వేశారు. పులిచింతలలో 18 టీఎంసీల మేర ఫ్లడ్ కుషన్ అందుబాటులో ఉందని, నాగార్జునసాగర్‌కు కూడా భారీగా ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నందున చెరువులు, రిజర్వాయర్లను నింపాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్‌లోని జలాశయాల్లో నీటిని నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. మార్కాపురంలోని కంభం చెరువుతో పాటు ఆయా జిల్లాల్లోని మీడియం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాలను కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
చెరువులకు గండ్లు పడకుండా చర్యలు
మురసు తుఫాను ప్రభావం ఉన్న 6 జిల్లాల పరిధిలోని 6,800 చెరువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సాగునీటి సంఘాలను క్రియాశీలం చేసి ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. జలధార కార్యక్రమం కింద చేపట్టిన పనులను వినియోగించుకోవాలని, ఎక్కడా చెరువులకు గండ్లు పడకుండా చూడాలని స్పష్టం చేశారు. డ్రెయిన్లలో పూడిక కారణంగా పంటలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో గర్భిణులను ముందుగానే ఆసుపత్రుల్లో చేర్పించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 3,066 మంది గర్భిణీలను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కచ్చా ఇళ్లలో నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అవసరమైన నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అవసరాన్ని బట్టి మోహరించాలన్నారు. రైల్వే మార్గాలు, జాతీయ రహదారుల వద్ద లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఉంటే రాకపోకలను నియంత్రించాలని ఆదేశించారు. మత్స్యకారుల బోట్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రతి రెండు గంటలకు బులెటిన్
వర్షాలు, గాలులు, వరద ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షించాలని, సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి రెండు గంటలకు ఓసారి పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భరోసా కల్పించాలని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు హెచ్చరికల ప్రకటనలు విడుదల చేయాలని చెప్పారు. తుఫాను అనంతర పునరుద్ధరణ పనులను 48 గంటల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పంటల బీమా పరిహారం, ఇన్పుట్ సబ్సిడి ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్, వ్యవసాయ, జలవనరులు, అగ్నిమాపక సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా హాజరయ్యారు.








