- జోగిని హత్యకేసు చేధించిన పోలీసులు
- రూ.1.72 కోట్ల సొత్తు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
- పరిచయస్థులే హంతకులని గుర్తించిన పోలీసులు
చౌటుప్పల్, మహా : యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించిన జోగిని రాళ్లబండ సుధాకర్ స్వామి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నమ్మకంగా శిష్యులుగా ఉంటూనే పక్కా పథకంతో ఆయనను హత్య చేసి ఇంట్లోని బంగారం, వెండి, నగదుతో పరారైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుల వద్ద నుంచి సుమారు 1,319 గ్రాముల బంగారం, 3.6 కిలోల వెండి, రూ.9 లక్షల నగదుతో పాటు సుధాకర్ స్వామికి చెందిన కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.1.72 కోట్లుగా అధికారులు వెల్లడించారు. జోగిని సుధాకర్‌ను చంపిన తర్వాత నిందితులు అతడి కారును తీసుకుపోవడమే వారిని పట్టించేందుకు ఉపయోగపడిందని పోలీసులు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాకకు చెందిన రాళ్లబండ సుధాకర్ స్వామి (45) చౌటుప్పల్‌లోని మార్కండేయ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆయన జోగినిగా, శివసత్తుగా వ్యవహరిస్తూ గ్రామాల్లో ఎల్లమ్మ, ముత్యాలమ్మ పండుగల సందర్భంగా పూజలు నిర్వహించేవారు. పండుగల సమయంలో పూజారిగా సేవలందించడంతో పాటు కొలుపులు కూడా చెప్పేవారు. సుధాకర్ స్వామికి అస్సాంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లే అలవాటు ఉంది. సుమారు 2 ఏళ్ల క్రితం అక్కడికి వెళ్లిన సమయంలో పవన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పరిచయంతో పవన్ పలుమార్లు చౌటుప్పల్‌కు వచ్చి వెళ్లేవాడని తెలిపారు. అనంతరం హర్షు అనే మరో వ్యక్తితో కలిసి సుధాకర్ స్వామి వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఆయనకు పరిచయస్తులుగా, శిష్యులుగా ఉంటూ నమ్మకం సంపాదించుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలోనే అక్టోబర్ 31వ తేదీన రాత్రి నిందితులు సుధాకర్ స్వామి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన మేనల్లుడు గుర్రం సురేశ్ రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేయగా అస్సాం నుంచి పవన్, హర్షు వచ్చారని, వారితో మాట్లాడుతున్నానని సుధాకర్ స్వామి చెప్పినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో సుధాకర్ స్వామి ఫోన్ నుంచి ఆయన మేనల్లుడు సురేశ్‌కు హిందీ భాషలో వాట్సాప్ మెసేజ్‌లు వెళ్లాయి. దీంతో అనుమానం వచ్చిన సురేశ్ ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ కారు కనిపించకపోవడం, ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇంట్లో పరిశీలించగా, మొదటి అంతస్తులోని మంచంపై సుధాకర్ స్వామి మృతదేహం కనిపించింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు ఆయన కాళ్లు, చేతులు కట్టేసి, పెప్పర్ స్ప్రే ఉపయోగించి, గొంతు నులిమి, కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును తీసుకుని సుధాకర్ స్వామి కారులోనే పరారయ్యారు. సుధాకర్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు సుధాకర్ స్వామి కారులోనే నగలతో పరారయ్యారు. అయితే కారులోని జీపీఎస్, ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుములు చెల్లించిన నోటిఫికేషన్లు పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. కారు ఏ మార్గంలో వెళ్తోందన్న వివరాలను సేకరించిన పోలీసులు ఇతర ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో నిర్మల్ ప్రాంతంలో నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా నిందితులను పట్టుకున్నారు.
పవన్, హర్షు అలియాస్ హర్షిత్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 1,319 గ్రాముల బంగారం, 3.6 కిలోల వెండి, రూ.9 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నిందితులను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులకు అప్పగించి విచారణ చేపట్టారు. సుధాకర్ స్వామికి పరిచయస్తులైన వ్యక్తులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించడం ఈ ఘటనలో కలకలం రేపుతోంది. ఆయన ఇంట్లో విలువైన బంగారం, వెండి, నగదు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్న నిందితులు ముందస్తు ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితులను విచారిస్తూ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, దోపిడీ చేసిన సొత్తు మొత్తం, ఇతర ఆధారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.








