Mahaa Daily Exclusive

  హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌పై మరో ముందడుగు..

Share

  • హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌పై మరో ముందడుగు
  • రూ. 275 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • పనుల వేగం కోసం రూ. 150 కోట్లు
  • అలైన్ మెంట్, సర్వేల తదితరాల కోసం రూ.125 కోట్లు

హైదరాబాద్, మహా : హైదరాబాద్‌లో వేగవంతమైన, సురక్షితమైన రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ తదుపరి పనులను వేగవంతం చేయడంతో పాటు ఆర్థిక అవసరాల కోసం రూ. 275 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు కేంద్రం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో నగరంలో మెట్రో విస్తరణ పనుల మరింత ముందుకు వెళ్లనున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ. 275 కోట్ల నిధులను ప్రధానంగా రెండు ముఖ్యమైన విభాగాలుగా విభజించి కేటాయింపులు జరిపారు. హైదరాబాద్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే కొత్త మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించేందుకు ప్రతిపాదించిన ఫేజ్-2 నిర్మాణ పనుల వేగాన్ని పెంచడానికి రూ. 150 కోట్లను కేటాయించారు. అలైన్‌మెంట్ సర్వేలు, ప్రాథమిక పనులు, డీపీఆర్ పురోగతి, తదుపరి నిర్మాణ ప్రాసెస్ కోసం ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మరో రూ.125 కోట్లను రుణం రూపంలో ఇవ్వనుంది.

నగరంలో పెరుగుతున్న జనాభా, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని పాతబస్తీ కనెక్టివిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గం, మైండ్ స్పేస్ – శంషాబాద్ కారిడార్లతో పాటు ప్రధాన రహదారులను కలుపుతూ ఫేజ్-2 ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. రెండో దశలో రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర రైలు విస్తరణకు గతంలో అనుమతి లభించింది. నగరంలోని ఐటీ కారిడార్లు, నివాస ప్రాంతాలు, కమర్షియల్ హబ్‌లను అనుసంధానించడం ద్వారా నిత్యం ప్రయాణించే లక్షలాది మందికి ఉపశమనం లభిస్తుంది. నగరం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ఈ విస్తరణ ప్రధాన లక్ష్యం.

మెట్రో లైన్ల విస్తరణతో కొత్తగా కవర్ అయ్యే ప్రాంతాలలో రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాలు మరింత పుంజుకోనున్నాయి. ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయడంతో ఫేజ్-2కి సంబంధించి నిలిచిపోయిన లేదా మందకొడిగా సాగుతున్న పనులు వేగవంతం కానున్నాయి. రుణాల చెల్లింపుల కోసం స్పష్టమైన నిధుల కేటాయింపులు జరగడం వల్ల ప్రాజెక్ట్ ఆర్థిక నిర్వహణ మరింత సులభతరం కానుంది.