- ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ‘ఒకే వేదికపై ఎప్పుడూ నిరసనలంటే ఎలా?’
- నిరవధికంగా ఆక్రమించుకునేందుకు వీల్లేదని స్పష్టం
న్యూఢిల్లీ, మహా : పండుగల సీజన్లో నిరసనల పేరుతో ఒకే ప్రాంతాన్ని నిరవధికంగా ఆక్రమించుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆందోళనలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉన్నప్పటికీ, వాటికి నిర్దిష్ట సమయంతోపాటు కాలపరిమితి ఉండాలని పేర్కొంది. రైతులు, జర్నలిస్టులు, ఇతర వర్గాల వారు కూడా తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు అవకాశం ఉండాలని వ్యాఖ్యానించింది. దిల్లీలోని రామ్లీలా మైదానంలో కొనసాగుతున్న ఆందోళనల వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపార సంఘాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా మంగళవారం న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
సీఈసీకి వ్యతిరేకంగా, ఓట్ చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల కారణంగా పండుగల సమయంలో వ్యాపారాలు నష్టపోతున్నాయని వ్యాపార సంఘాలు ఇటీవల కోర్టును ఆశ్రయించాయి. ఆందోళనలను నిలిపివేయాలని, పండుగల సీజన్లో నిరసనలపై ఆంక్షలు విధించాలని కోరాయి. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక నిరసన కోసం కేటాయించిన ప్రాంతాన్ని ఎల్లకాలం ఒకే వర్గం ఆధీనంలో ఉంచుకోవడానికి వీల్లేదన్నారు. అలా అయితే ఇతర సమస్యలపై ఆందోళనలు చేయాలనుకునే రైతులు, జర్నలిస్టులు, ఇతర వర్గాలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే వాటికి నిర్దిష్ట సమయం, కాలపరిమితి ఉండాలని స్పష్టం చేశారు. నిరసనలకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని నిరవధికంగా ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక నిరసనకు కేటాయించిన సమయం ముగిసిన తర్వాత ఇతర వర్గాలకు కూడా ఆ ప్రాంతాన్ని వినియోగించుకునే అవకాశం ఉండాలని వ్యాఖ్యానించింది.







