Mahaa Daily Exclusive

  హిమాలయాల్లో ఘోర ప్రమాదం…

Share

  • హిమాలయాల్లో ఘోర ప్రమాదం
  • రెండు హెలికాప్టర్లు ఢీ
  • ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు!

ఇంటర్నెట్ డెస్క్, మహా : నేపాల్ లోని ఫెరిచే వద్ద ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఫిష్‌టైల్ ఎయిర్‌ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఒక భారతీయ పౌరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పైలట్లతో సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు హెలికాప్టర్లు ఫిష్‌టైల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీ సంస్థలకు చెందినవిగా అధికారులు నిర్ధారించారు.

మంచు కొండల్లో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం

సోలుఖుంబు జిల్లా పరిధిలోని ఫెరిచే హెలిప్యాడ్‌లో మంచుతో కప్పబడిన ప్రదేశంలో ల్యాండ్ అయ్యేందుకు రెండు హెలికాప్టర్లు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక కథనాలు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం దాదాపు 8:11 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన భారతీయ పౌరుడిని వసంత్ కుమార్ బలరామరామడుగా గుర్తించినట్లు సోలుఖుంబు జిల్లా పోలీస్ చీఫ్ మౌసమ్ తమాంగ్ వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం లుక్లాలోని ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారికి చికిత్స

ఫిష్‌టైల్ ఎయిర్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి పౌరుడు శైలేష్ కృష్ణ పటేల్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ను ప్రభు హెలికాప్టర్ ద్వారా అత్యవసర చికిత్స నిమిత్తం ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ఈ ప్రమాదంలో ఫిష్‌టైల్ ఎయిర్ హెలికాప్టర్‌కు కెప్టెన్ ప్రజ్వల్ కేసీ, ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్‌కు కెప్టెన్ రవీంద్ర ప్రజాపతి పైలట్లుగా వ్యవహరించారు. ఈ ఘటనలో కెప్టెన్ ప్రజాపతితో పాటు మరొకరు కూడా గాయపడ్డారు.

రంగంలోకి సహాయక బృందాలు

ప్రమాదం జరిగిన వెంటనే సిమ్రిక్ ఎయిర్‌కు చెందిన మరో హెలికాప్టర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేసింది. మంచుతో కప్పబడిన కొండ ప్రాంతంలో హెలికాప్టర్లు ధ్వంసమై పడి ఉన్న దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత కోసం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.