Mahaa Daily Exclusive

  యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు

Share

  • కొన్నిచోట్ల వాయిదా
  • నేడు పోలింగ్ జరుగుతుందన్న ఏపీ ఎస్ఈసీ

అమరావతి, మహా : రాష్ట్రంలో వరుస తుపానులతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అయితే వాతావరణ పరిస్థితుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ వాయిదా అని ప్రచారం జరిగింది. దాంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే నవంబర్ 5న యథావిధిగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్ఈసీ స్పష్టం చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నచోట మాత్రమే ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న గుంటూరులో 3 మండలాల్లో (పెదనందిపాడు, ఫిరంగిపురం, కాకుమాను) లలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ సమీక్ష

ఇటీవల కురిసిన తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరదలు ముంచెత్తడంతో ఎన్నికల నిర్వహణపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితులపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో తుపాను నష్టం, క్షేత్రస్థాయిలో వరదల తీవ్రత, పోలింగ్ నిర్వహణ పరిస్థితులపై క్షుణ్ణంగా చర్చించారు. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టాయని, ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్లు ఎన్నికల కమిషనర్‌కు నివేదించారు.

కలెక్టర్ల నుంచి వచ్చిన స్పష్టమైన నివేదికలను ఎస్ఈసీ పునేఠా పరిశీలించారు. పరిస్థితులు అనుకూలించిన చోట పోలింగ్ ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా, నిష్పాక్షికంగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. మరీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నచోట మాత్రమే ఎన్నికల నిర్వహణ వాయిదా వేయడంపై తమకు సమాచారం అందించాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులను అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.