Mahaa Daily Exclusive

  మేడ్చల్ లో కలకలం….

Share

  • మేడ్చల్ లో కలకలం
  • పోలీస్ స్టేషన్ పక్కనే జ్యువెలరీ షాపులో చోరీ
  • గోడకు కన్నం వేసి ఆభరణాలు అపహరణ

మేడ్చల్, మహా : మేడ్చల్‌లో దొంగలు పోలీసులకే సవాల్ విసిరారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక గది గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దుండగులు విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌ను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో దుకాణం వెనుక భాగంలోని గది గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. అనంతరం దుకాణంలో ఉన్న విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను మూటగట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు. చోరీ జరిగిన సమయంలో ఎలాంటి అలజడి బయటకు రాకుండా దుండగులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని శేషమాల్ చౌదరి కుమారుడు అజయ్ చౌదరి లోపల వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో పాటు గోడకు కన్నం వేసి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో యజమాని శేషమాల్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న క్రైమ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగులు చొరబడిన మార్గం, చోరీ జరిగిన తీరును పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించే అవకాశం ఉంది.

మరోవైపు, ఇదే జ్యువెలరీ దుకాణంలో గతంలోనూ చోరీ జరిగినట్లు సమాచారం. తాజాగా రెండోసారి దొంగతనం జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే దుండగులు చోరీకి పాల్పడటంతో భద్రతా వ్యవస్థపై స్థానిక వ్యాపారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వరుస చోరీలతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్ట్ చేయడంతోపాటు రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని పోలీసులను కోరుతున్నారు.