Mahaa Daily Exclusive

  దీపావళి శుభాకాంక్షలు

Share

  • దేశ ప్రజలకు ప్రధాని మోడీ సందేశం
  • చీకటిపై వెలుగు.. చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి…
  • సైనికులతో పండుగ జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తా

 

న్యూఢిల్లీ, మహా : దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను సైనికులతో కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. శనివారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో సందేశంలో దేశ ప్రజలకు సుఖసంతోషాలు, సిరిసంపదలతో కూడిన దీపావళి కావాలని ఆకాంక్షించారు.

 

దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి, నిరాశపై ఆశ సాధించే విజయానికి ప్రతీకగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయాలను స్మరించుకుంటూ పరస్పర ఐక్యత, అనుబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పండుగ చక్కని అవకాశమని అన్నారు. ప్రతి ఇంటా సంతోషం, సామరస్యం, సిరిసంపదల వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రజల్లో సద్భావనను పెంపొందించాలని, సానుకూల దృక్పథాన్ని అలవరచుకునేలా స్ఫూర్తినివ్వాలని మోదీ కోరారు. సరికొత్త ఉత్సాహం, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ సుసంపన్నమైన, వికసిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరోసారి దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.