- దేశం మీకు రుణపడి ఉంది
- గత ఏడాది విధి నిర్వహణలో ఒక్క సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోలేదు
- గత ప్రభుత్వాలు నక్సలిజాన్ని నయం చేయలేని రోగంగా భావించాయి
- బస్తర్ జిల్లాలో జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
బస్తర్, మహా : దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు వెళ్లి భద్రతా బలగాలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు నక్సలిజం భయం పూర్తిగా అంతమైందని, అభివృద్ధి వసంతం ప్రారంభమైందన్నారు. దీపావళి జరుపుకోవడానికి మీ మధ్య బస్తర్ అడవుల్లోకి వచ్చానని ప్రధాని మోదీ భద్రతా బలగాలతో అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. గడిచిన ఏడాది కాలంలో విధి నిర్వహణలో ఒక్క సీఆర్పీఎఫ్ జవాను సైతం ప్రాణాలు కోల్పోకపోవడం గత 47 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి అని మోదీ పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలకు భద్రతా బలగాల గురించి పట్టింపు లేదని అన్నారు. 2014 కంటే ముందు దేశంలో నక్సల్స్ కంటే భద్రతా సిబ్బందే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయేవారని… గత ప్రభుత్వాలు నక్సలిజాన్ని నయం చేయలేని రోగంగా భావించి వదిలేశాయని ఆరోపించారు. దంతేవాడలో 76 మంది జవాన్ల ఊచకోత వంటి ఘటనలను గుర్తుచేసిన ఆయన… ఆ సమయంలో పాలకుల నుంచి సరైన స్పందన లేదన్నారు. ‘నేడు దేశమంతా, ప్రపంచంలోని ప్రతి మూలలో కోట్లాది భారతీయులు దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలుసుకునే ఇది ఒక పెద్ద వేడుక, నేను కూడా దీపావళి జరుపుకోవడానికి మీ వద్దకు వచ్చాను’ అని ప్రధాని మోదీ అన్నారు.
జవాన్లతో దీపావళి మరపురానిది – ప్రధాని మోదీ
‘సరిహద్దుల్లోనూ, దేశం లోపల కూడా దేశాన్ని రక్షించే వారు భూ మాతకు వీరులు. మీరందరూ నా కుమారులు, కుమార్తెలు, మీరు నా కుటుంబంలో భాగం. హిమాలయాల ఒడిలో కార్గిల్ నుంచి లెప్చా వరకు, సముద్ర తీరంలోని సర్ క్రీక్ నుంచి సముద్ర గర్భంలోని INS విక్రాంత్ వరకు వీర జవాన్లతో గడిపిన ప్రతి దీపావళి క్షణాలు మరపురానివి’ అని మోదీ పేర్కొన్నారు. `ఇది అసాధారణ విజయం. దేశ ప్రజలకు రక్షణ అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలిపాలి. మీలాంటి లక్షలాది వీరులు, జవాన్లు, భద్రతా సిబ్బంది వల్ల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అందుకే నేడు మీతో కలిసి దీపావళి జరుపుకోవడానికి వచ్చాను, అలాగే 140 కోట్ల దేశవాసుల తరఫున మీ త్యాగం, అంకితభావం, సేవా మనసుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చాను’ – ప్రధాని నరేంద్ర మోదీ
నక్సలిజంపై విజయం సాధించిన తర్వాత తొలి దీపావళి
‘2026 సంవత్సరం దీపావళి నిజంగా ప్రత్యేకం. దేశం నక్సలిజం-మావోయిస్టు ఉగ్రవాదంపై దశాబ్దాల పాత పోరాటంలో విజయం సాధించిన తర్వాత ఇది తొలి దీపావళి. దేశంలోని ప్రతి జిల్లా నక్సలిజం నుంచి విముక్తి పొందాక ఇది తొలి దీపాల వేడుక. కోట్లాది దేశ ప్రజలు నక్సలిజం భయాన్ని జయించారు. మావోయిస్టు ఉగ్రవాదం, నక్సలిజంపై ఈ పోరాటం అంత సులభం కాదు. ఒకప్పుడు దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో 230కి పైగా జిల్లాల్లో నక్సలిజం ప్రభావం ఉండేది. సాయంత్రం అయ్యాక అక్కడ రాకపోకలు ఆగిపోయేవి. ప్రజల ఓటు హక్కును కూడా ఈ నక్సలైట్లు లాక్కున్నారు.
బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా దేశంలోని ఎక్కువ భాగం వామపక్ష తీవ్రవాదం బారిన పడింది. వేలాది గ్రామాలు, కోట్లాది జనాభా, ఏడాదికి 2 వేల వరకు నక్సలైట్ దాడులు. 2010లో ఇక్కడే సమీపంలోని దంతేవాడలో నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో 76 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 2010లోనూ దంతేవాడలోనే మరో ఘటనలో 44 మంది పౌరులు హత్యకు గురయ్యారని’ ప్రధాని మోదీ గుర్తుచేశారు.
చివరగా ప్రధాని మోదీ.. ‘ఈ నేల మన వీరుల రక్తంతో శాపానికి గురైనట్లైంది. రాజభవనాల్లో నివసించే వారికి బలగాల వెక్కిళ్లు కూడా వినిపించలేదు. ఏ నామదార్ కళ్లలోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. దశాబ్దాల పాటు ఇదే తంతు కొనసాగింది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోనే 1,000 మందికి పైగా జవాన్లు ప్రాణత్యాగం చేశారు. ఐఈడీ పేలుళ్లలో ఎంతో మంది జవాన్లు చేతులు, కాళ్లు కోల్పోయారని’ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.







