Mahaa Daily Exclusive

  కొత్త ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్….

Share

  • కొత్త ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్
  • మహిళా పారిశ్రామిక పార్కు
  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

అమరావతి, మహా : సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. విశాఖలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌పై చర్చించారు. సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంపై మాట్లాడారు. రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆమోదం లభించింది. నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఆమోదం దక్కింది. తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమకు ఓకే చెప్పారు. భీమిలి అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్‌కు ఆమోదం తెలిపారు. పశ్చిమగోదావరి తణుకులో రవళి స్పిన్నర్స్ రూ.237 కోట్ల పరిశ్రమ విస్తరణ చేయనున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల కేటాయించారు. జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కుకు ఆమోదం లభించింది. భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్కు 24.96 ఎకరాల భూమి కేటాయించారు. విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు.

అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల విస్తీర్ణంలో స్కికార్ప్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకం కోసం సుమారు 21 ఎకరాల్లో కొత్త ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఆమోదం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా డీటీఎంఆర్ఎస్ (డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ సేఫ్టీ పేరుతో ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుంది. సాంప్రదాయ థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ సాంకేతికతతో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

విజయవాడ నగరంలో 15 మెగావాట్ల సామర్థ్యంతో చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏపీ జెన్‌కోకు చెందిన 5.50 ఎకరాల భూమిని ఉచితంగా బదిలీ చేసేందుకు కేబినెట్ అంగీకరించింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో సౌర విద్యుత్ ప్రాజెక్టు స్థాపన కోసం 192.68 ఎకరాల వక్ఫ్ భూమిని 30 ఏళ్ల కాలపరిమితికి దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు అనుమతించింది. అమరావతి రాజధాని పరిధిలోని శాఖమూరులో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి 5 ఎకరాల భూమిని లీజుకు కేటాయించడంతో పాటు, దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కొత్తగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అత్యంత పవిత్రమైన ప్రధాన సన్నిధి యాదవ, సన్నిధి యాదవ పోస్టుల కొత్త ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దేవాదాయ శాఖలో ఆలయాల నిర్మాణాలు, శిల్ప కళా నిర్వహణ కోసం సూపరింటెండెంట్ ఇంజనీర్ హోదాలో ముఖ్య స్థపతి పోస్టులను మంజూరు చేశారు. నాయుడుపేట సెజ్ పరిధిలో గతంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని లేదా ప్రాజెక్టులు ప్రారంభించని వెబ్సోల్ రెన్యువబుల్స్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.