- ‘వ్యక్తిగత విషయం’
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకులపై
- నో కామెంట్ అన్న వైసీపీ నేత అంబటి రాంబాబు
గుంటూరు, మహా : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకుల అంశంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్పందించారు. పవన్ విడాకుల విషయమైన మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. విడాకులు గురించి, వివాహాల గురించి తాను కామెంట్ చేయదలచుకోలేదన్నారు. ‘‘ఎందుకంటే అది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం కాబట్టి దాని గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి సిద్ధంగా లేను.. ఇలాంటి ప్రైవేట్ విషయాలపై మాట్లాడను’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ విడాకుల విషయంలో వైసీపీ ముందు నుంచి ఒకే వైఖరితో ఉందని, ఇతరుల వ్యక్తిగత విషయాలపై తాము స్పందించబోమని అంబటి స్పష్టం చేశారు.
అయితే, గతంలో పవన్ పెళ్లిళ్లు, వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం గమనార్హం. ఇక, ఆ పార్టీ కూడా పవన్ కళ్యాణ్, అన్నా లెజెనొవా పేర్లను నేరుగా ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో కార్యకర్తలకు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వ్యాఖ్యలు, పోస్ట్‌లు పెట్టడం, షేర్, కామెంట్ చేయడం వద్దని సూచించింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజెనోవా దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఇరువురూ సంయుక్తంగా ప్రకటన చేశారు. అయితే, పవన్ విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ జంట విడిపోయినట్టు పుకార్లు షికార్లు చేశాయి. కానీ, పవన్ ఎన్నికల్లో గెలుపు తర్వాత వీటన్నింటికీ పుల్‌స్టాప్ పడింది. డిప్యూటీ సీఎం భార్యగా ఆమె పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. గతేడాది తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన కోసం గత జులైలో కాలినడకన లెజెనోవా తిరుమలకు వెళ్లారు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా విడాకులు ప్రకటన రావడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.








