- పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు
- క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
- సోషల్ మీడియా పోస్టులు చేయోద్దని సూచన
- అదే దారిలో టీడీపీ
అమరావతి, మహా : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి విమర్శలు చేయకూడదని, సోషల్ మీడియా వేదికగా ఎలాంటి వ్యాఖ్యలు పోస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో జరిగే చర్చలకు, విమర్శలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్నెవాలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న ప్రకటించారు. దీనిపై వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది.
పార్టీ నేతలు, అధికారిక ప్రతినిధులు, కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం సభ్యులుగానీ పవన్ వ్యక్తిగత వ్యవహారంపై బహిరంగంగా స్పందించవద్దని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. వ్యక్తిగత అంశాలపై సోషల్ మీడియాలో జరిగే చర్చల్లో పాల్గొనవద్దని, ఆ పోస్టులకు ప్రతిస్పందించవద్దని, ఫోటోలు, వీడియోలు లేదా ఇతర సమాచారాన్ని షేర్ లేదా ప్రచారం చేయవద్దని సూచించింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ బాధ్యతాయుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు.
వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలన్న జగన్
వైఎస్సార్సీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తల మధ్య తరచూ ఆన్లైన్ వార్ కొనసాగే నేపథ్యంలో, వ్యక్తిగత విషయాల్లో సంయమనం పాటించాలని నిర్దేశించారు. విమర్శలు కేవలం రాజకీయాలకే పరిమితం కావాలని, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకోవద్దని జగన్ ఆదేశించారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి, షర్మిల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
మరోవైపు, అధికార కూటమి భాగస్వామి అయిన టీడీపీ, ఐటీ విభాగం కూడా కూటమి నాయకులతో పాటు ప్రతిపక్ష వైసీపీ నేతల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి విమర్శలను సహించేది లేదని స్పష్టం చేసింది. అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా ఖాతాల ద్వారా వ్యక్తిగత విమర్శలు లేదా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేలితే తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యక్తిగత అభిప్రాయాలతో ఐటీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.








