- టీజీపీఎస్ సీ ప్రక్షాళన
- యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దుతాం
- సీఎం రేవంత్ కీలక ప్రకటన
- గతంలో టీజీపీఎస్ సీని రాజకీయ పునరావాస కేంద్రంగా చేశారని వ్యాఖ్య
- కనిషన్ బోర్డులో అవగాహన, అనుభవం లేని వ్యక్తులను నియమించారన్న సీఎం
హైదరాబాద్, మహా : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్ సీ)ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సీ) తరహాలో పారదర్శకంగా, సమర్థంగా పనిచేసే సంస్థగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, కమిషన్ బోర్డులో సరైన అవగాహన, అనుభవం లేని వ్యక్తులను నియమించడం వల్లే నియామక ప్రక్రియలో గందరగోళం ఏర్పడిందని విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కమిషన్ను ప్రక్షాళన చేసి, అనుభవం, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులను బోర్డులో నియమించినట్లు తెలిపారు.
మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన సీఎం గ్రూప్-1 నియామకాలతోపాటు యువ అధికారుల బాధ్యతలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో గ్రూప్-1 నియామకాలు జరిగాయని, ఆ తర్వాత దాదాపు 13 ఏళ్లపాటు కొత్త నియామకాల ప్రక్రియ ముందుకు సాగలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళం కారణంగా ఎంతోమంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. 563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా. 562 మంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారని సీఎం వెల్లడించారు. నియామక ప్రక్రియపై కొందరు ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించి, ప్రభుత్వం చేయని తప్పులను ఆపాదిస్తూ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ పరిణామాలతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. నియామకాలపై న్యాయస్థానాల్లో ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించిందని, సుప్రీంకోర్టు సైతం ప్రక్రియను సమర్థించిందని చెప్పారు.
డీఎస్పీలుగా బాధ్యతలు చేపట్టబోతున్న యువ అధికారులు తమ గత నేపథ్యాన్ని, ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాన్ని మర్చిపోవద్దని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం, ముఖ్యంగా పోలీసు అధికారి హోదా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావించాలని అన్నారు. అధికారం ప్రజల సంక్షేమం కోసం వినియోగించినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఆ గౌరవం నిలవదని హితవు పలికారు. ప్రజలు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను ఓపికగా వినాలని, బాధితుల పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని న్యాయం జరిగేలా కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ భవిష్యత్తు యువ అధికారుల చేతుల్లోనే ఉందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శిక్షణ సమయంలో ప్రతిభ కనబరిచిన ట్రైనీ డీఎస్పీలకు సీఎం మెడల్స్ అందజేసి అభినందించారు.








