- విద్యకు వయసుతో సంబంధం లేదు
- మాజీమంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ
- అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5.55 కోట్లతో నిర్మించిన కృష్ణా కాలేజీని ప్రారంభించిన ఎమ్మెల్యే సురేఖ
వరంగల్, మహా
విద్యకు వయసుతో సంబంధం లేదని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు.
చదువుకున్నందునే తాను ఓ మంచి లీడర్ అయ్యానని, తనను ఈ స్థాయికి తెచ్చింది తన భర్త కొండా మురళీధర్ రావు అని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. చదువుతో పాటు, ఆటల్లోనూ తాను ముందుండే దాన్నన్ని చెప్పారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5.55కోట్లతో నిర్మించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం కృష్ణా కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ నూతన భవనాన్ని గురువారం మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన ఆడిటోరియంలో నిర్వహించిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ శరదృతి అధ్యక్షతన నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ విద్యకు వయసుతో సంబంధం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చెన్నై కి చెందిన ఓ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశానని తెలిపారు. విద్యను ఎవరూ ఎత్తుకుపోరని, ఒకరు చదువుకుంటే పది మందికి ఉపయోగపడుతుందని అన్నారు. చదువుపై నిర్లక్ష్యం ఉండొద్దని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థులకు లక్ష్యం ఉండాలని, అందుకోసం పునాది వేసుకొని ప్రిపేర్ కావాలని చెప్పారు. ఇంటర్ లో విద్యార్థులు తప్పటడుగు వేయొద్దన్నారు. విద్యార్థినులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకారం ఇవ్వాలని చెప్పారు. కరోనా తర్వాత సమాజం మారిపోయిందని, సెల్ ఫోన్ల వినియోగం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయన్నారు. చదువు తప్ప మరో ఆలోచన ఉండొద్దని, తప్పు చేయొద్దని చెప్పారు. ప్రస్తుత విద్యార్థులే భవిష్యత్ తరమని, వారికి మంచి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారే ఐఏఎస్, ఐపీఎస్ లు, రాజకీయ నాయకులు అయ్యారని పేర్కొన్నారు. తానూ ప్రభుత్వ స్కూల్, కాలేజీలోనే చదువుకున్నానన్నారు. తాము తెలుగుమీడియంలో చదువుకున్నామని, ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత ఇంగ్లీష్ విద్యను అందిస్తోందని తెలిపారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, పోటీ తత్వం ఉండాలని చెప్పారు. తాను ఎంపీపీగా ఉన్నపుడు, స్కూళ్లలో సందర్శనకు వెళ్లేదాన్నన్ని గుర్తు చేశారు. టీచర్లు వేలాది మందికి చదువు నేర్పుతారని, వారి విద్యార్థులు ప్రపంచంలో వివిధ స్థానాల్లో ఉంటారని చెప్పారు. విద్యార్థులు ఎదిగితే గురువులు హర్షిస్తారన్నారు.
*విద్యాసంస్థల కోసం సొంత స్థలం ఇచ్చాం*
గతంలో తాను శాయంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన భర్త కొండా మురళీధర్ రావు ప్రభుత్వ గురుకులం కోసం 13ఎకరాల స్థలాన్ని సొంతంగా కొనుగోలు చేసి ఇచ్చారని కొండా సురేఖ గుర్తు చేశారు. పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో విద్యాసంస్థలు, స్మశానాలు, కుల సంఘాల కోసం విలువైన భూములు ఇచ్చారని తెలిపారు. అదే మార్గంలో అరబిందో ఫార్మా సంస్థ కాలేజీ భవన నిర్మాణం కోసం సహకరించడం ఎంతో అభినందనీయం అన్నారు. 70ఏండ్ల చరిత్ర ఉన్న కృష్ణా కాలేజీ ఎంతో మందిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిందని తెలిపారు.
విద్యార్థినుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలేజీ నిర్మించాలని కోరగానే సహకరించిన అరబిందో సంస్థకు ఈ సందర్భంగా సురేఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య అందుతోందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పై ప్రత్యేక శ్రద్ధ ఉంచిందని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు టిఫిన్, భోజనం అందిస్తున్నామని, హాస్టల్ల విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచారని పేర్కొన్నారు.
*ఇచ్చిన మాట ప్రకారం భవనం పూర్తి చేశాం*
కృష్ణా కాలేజీ భవనం నిర్మాణంలో పిల్లర్స్ వేసే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినా ఇచ్చిన మాట ప్రకారం భవన నిర్మాణాన్ని పూర్తి చేశామని అరబిందో ఫార్మసీ డైరెక్టర్ సదానంద రెడ్డి అన్నారు. రూ.5.50 కోట్లతో నిర్మించిన భవనం బాలికల బంగారు భవిష్యత్ ను చూపుతుందన్నారు. బాలికలు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. నూతన భవనం 100 సంవత్సరాలు ఉండేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్మించామని తెలిపారు. అరబిందో ఫార్మ ప్రతినిధి లక్ష్మీనాథరెడ్డి మాట్లాడుతూ నిర్మాణ ప్రారంభించినపుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నామన్నారు. అరబిందో సంస్థ సహకారంతో కాలేజీకి భవనం కట్టించడం ఆనందంగా ఉందని చెప్పారు. విద్యార్థినులు బాగా చదువుకోవాలి, వ్యక్తిత్వ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని, వారి కుటుంబాన్ని పైకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మీసాల ప్రకాష్, అరబిందో ఫార్మా ప్రతినిధులు శరత్ చంద్రారెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజ్, కాంగ్రెస్ నాయకులు చింతాకుల సునీల్, జారతి రమేష్, కోడం శివకృష్ణ, సయ్యద్ వసీం, కురిమిళ్ల సంపత్ కుమార్, మబ్బు ప్రవీణ్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.








