Mahaa Daily Exclusive

  బ్రహ్మోస్‌కు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌..

బ్రహ్మోస్‌కు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌.
• ఫిలిప్పీన్స్‌, వియత్నాం బాటలో మరిన్ని దేశాలు.
• ఎగుమతి ఒప్పందాలపై చర్చలు

హైదరాబాద్‌, మహా:

భారత్‌ అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిగా గుర్తింపు పొందిన బ్రహ్మోస్‌కు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలు ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ క్షిపణులను అందించిన భారత్‌.. తాజాగా వియత్నాంతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. వీటితోపాటు మరికొన్ని దేశాలతో ఎగుమతి ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే కొత్త ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉందని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జైతీర్థ్‌ ఆర్‌. జోషి వెల్లడించారు.

శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థపై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఆయా దేశాలతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు వచ్చిన తర్వాత ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు ఖరారవుతాయని వివరించారు. ఆగ్నేయాసియాలో భారత్‌ రక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణకు బ్రహ్మోస్‌ ఎగుమతులు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఆపరేషన్‌ సిందూర్‌తో పెరిగిన ఆసక్తి

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత బ్రహ్మోస్‌ క్షిపణిపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి మరింత పెరిగిందని జోషి పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో వినియోగించిన కొన్ని క్షిపణులు 10, 15 ఏళ్ల క్రితం తయారైనవని, మరికొన్ని 20 ఏళ్ల నాటివని వెల్లడించారు. ఇంతకాలం నిల్వ ఉంచినప్పటికీ అవి లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించాయని వివరించారు. క్షిపణుల పనితీరును దీర్ఘకాలం కొనసాగించడంలో నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఎన్‌డీటీ) విధానం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.

నాణ్యతను దెబ్బతీయకుండా పరీక్షలు

ఎన్‌డీటీ విధానంలో పరికరాలను విడదీయకుండా, వాటికి నష్టం కలిగించకుండా లోపాలు, నాణ్యత, పనితీరును పరిశీలిస్తారు. క్షిపణుల్లోని కీలక భాగాలు వినియోగానికి అనువుగా ఉన్నాయా లేదా అన్నది ఈ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఈ విధానం ఎంతో కీలకమైనది. ఏళ్ల తరబడి నిల్వ ఉంచే సైనిక పరికరాలను అవసరమైన సమయంలో వినియోగించేందుకు సిద్ధంగా ఉంచడంలో ఈ పరీక్షలు దోహదపడతాయి.

మాక్‌ 2.8 వేగంతో లక్ష్య ఛేదన

భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), రష్యాకు చెందిన ఎన్‌పీఓ మషినోస్ట్రోయెనియా సంయుక్తంగా బ్రహ్మోస్‌ క్షిపణిని అభివృద్ధి చేశాయి. ఇది రెండు దశల్లో పనిచేసే సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. తొలి దశలో ఘన ఇంధన బూస్టర్‌ క్షిపణిని అధిక వేగానికి తీసుకెళ్తుంది. అనంతరం ద్రవ ఇంధన రామ్‌జెట్‌ ఇంజిన్‌ దాని ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇది సుమారు మాక్‌ 2.8 వేగంతో ప్రయాణించగలదు. భారత రక్షణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో బ్రహ్మోస్‌ ఎగుమతులపై చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share