Mahaa Daily Exclusive

  దేశానికే ఆదర్శం తెలంగాణ గ్రేహౌండ్స్‌…

Share

  • దేశానికే ఆదర్శం తెలంగాణ గ్రేహౌండ్స్‌
  • డిజిపి సి. వి.ఆనంద్
  • రాజేంద్రనగర్ గ్రేహౌండ్స్ లో షూటింగ్ హౌస్ ను ప్రారంభించిన డిజిపి
  • నక్సలిజం, ఉగ్రవాద నియంత్రణలో కీలక పాత్ర

హైదరాబాద్, మహా : తెలంగాణ గ్రేహౌండ్స్‌ దేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తోందని డిజిపి సి.వి. ఆనంద్‌ కొనియాడారు. నక్సలిజం, ఉగ్రవాదం, హైజాకింగ్‌ వంటి ముప్పులను ఎదుర్కోవడంలో రాష్ట్ర అంతర్గత భద్రతతోపాటు దేశ భద్రతలోనూ గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ గ్రేహౌండ్స్‌ తరహా ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశారన్నారు. రాజేంద్రనగర్ లో శనివారం గ్రేహౌండ్స్‌ షూటింగ్‌ హౌస్‌ను ప్రారంభించిన సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, 1980 కాలంలో నక్సల్స్‌ కార్యకలాపాలు, ఉగ్రవాద ముప్పులను సమర్థంగా ఎదుర్కోవడంలో గ్రేహౌండ్స్‌ విశేష పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఇటీవల అక్టోబరు 31న గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించిన జాతీయ ఏక్తా దివస్‌ కార్యక్రమంలో తెలంగాణ గ్రేహౌండ్స్‌ ప్రదర్శించిన కవాతు అందరినీ ఆకట్టుకుందని, మన్ననలు పొందిందని తెలిపారు.

గ్రేహౌండ్స్‌ సిబ్బంది మెరుగైన శిక్షణ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రేహౌండ్స్‌ సిబ్బంది సంఖ్య కనీసం 700 మందికి తగ్గకుండా ఉంటుందన్నారు. కర్రెగుట్టలు ప్రాంతాల్లో సాధనతోపాటు అటవీ ప్రాంతాల్లో జంగిల్‌ ప్రాక్టీస్‌, వార్‌ఫేర్‌ శిక్షణను నిరంతరం కొనసాగించాలన్నారు. హైజాకింగ్‌, ఉగ్రవాద దాడులు, ఎలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ‘ఎనీ టైమ్‌.. ఎనీ సిచ్యుయేషన్‌.. యాక్షన్‌కు రెడీ’ అనే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 2027 ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ఆల్‌ ఇండియా పోలీస్‌ కమాండో పోటీల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ బృందం ప్రథమ బహుమతి సాధించాలని ఆకాంక్షించారు. శిక్షణ, షూటింగ్‌లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో రాణించి జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల కీర్తిని ఇనుమడింపజేయాలని సూచించారు.