Mahaa Daily Exclusive

  అమిత్‌ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి!

Share

అమిత్‌ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి!
* కేసీఆర్‌ నా రాజకీయ కథలో రావణాసురుడు.
* కేటీఆర్‌ మేనేజ్‌మెంట్‌ కోటా నేత.
* దక్షిణాది ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించేది లేదు.
* జనాభాతోపాటు జీడీపీని పరిగణనలోకి తీసుకోవాలి.
* సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌–2026లో సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

హైదరాబాద్, మహా:

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు నిజంగా దమ్ముంటే హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీపై గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతి, మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తన రాజకీయ కథలో రావణాసురుడిగా అభివర్ణించారు. కేటీఆర్‌ మేనేజ్‌మెంట్‌ కోటాలో నాయకుడయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు బీజేపీతోనే రాజకీయ పోటీ ఉందన్న వాదనను తోసిపుచ్చుతూ, రాష్ట్రంలో తమకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు.

శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్‌ నిర్వహించిన నాలుగో ఎడిషన్‌ ‘ది సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌–2026’లో పాల్గొన్న సీఎం జాతీయ రాజకీయాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, నియోజకవర్గాల పునర్విభజన, తెలంగాణ అభివృద్ధి, విద్య, ఉపాధి, క్రీడారంగం తదితర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రజల మధ్య జాతి, మతం, భాష పేరుతో విభజనలు సృష్టించడం కాకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.

జనాభాతోపాటు జీడీపీని పరిగణనలోకి తీసుకోవాలి

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రేవంత్‌ రెడ్డి కీలక అభిప్రాయాలు వెల్లడించారు. కేవలం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌ స్థానాలను 50 శాతం పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల సీట్ల సంఖ్య భారీగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం నిష్పత్తిపరంగా తగ్గిపోతుందని వివరించారు. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలకు కేంద్రంలో తగిన ప్రాధాన్యత లభించని పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.

దేశానికి ఆర్థికంగా గణనీయమైన సహకారం అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాల జనాభాతోపాటు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీడీపీ), ఆర్థిక ప్రగతి, అభివృద్ధి సూచికలను ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు శిక్ష పడేలా పునర్విభజన ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ల అమలుపైనా ముఖ్యమంత్రి స్పందించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడాన్ని స్వాగతిస్తూనే, అందుకు ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లోనే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 543 మంది సభ్యులున్న ప్రస్తుత లోక్‌సభలోనే 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి జాప్యం చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గాంధీ, నెహ్రూ నుంచి పీవీ వరకు.. కాంగ్రెస్‌ అభివృద్ధి నమూనా

దేశాభివృద్ధిలో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన విధానాలను సీఎం ప్రస్తావించారు. పేదవాడి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వసించారని గుర్తుచేశారు. నెహ్రూ హయాంలో విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక విద్యాసంస్థలు, నీటిపారుదల ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత ఆర్థిక విధానాలను మన్మోహన్‌ సింగ్‌ కొనసాగించారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్‌ అభివృద్ధి నమూనా అని చెప్పారు.

2047 నాటికి తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం

తెలంగాణను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ‘తెలంగాణ రైజింగ్‌–2047’ విజన్‌ను రూపొందించినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమన్నారు. గడిచిన మూడేళ్లలో నిర్దేశించుకున్న కార్యక్రమాల్లో 65 శాతం అమలు చేశామని, మిగిలిన కార్యక్రమాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు.

27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం

విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థుల హాజరు పెరుగుతోందని పేర్కొన్నారు. పదో తరగతి అనంతరం ఇంటర్మీడియట్‌ కళాశాలలు దూరంగా ఉండటంతో చదువుకు దూరమవుతున్న విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యను పాఠశాల విద్య పరిధిలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో నైపుణ్యాభివృద్ధి

విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు. ఆనంద్‌ మహీంద్రా ఛైర్మన్‌గా యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంప్రదాయ కోర్సులకు బదులుగా ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచస్థాయి విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

మెస్సీ వచ్చారు.. రొనాల్డోను కూడా తీసుకొస్తాం

క్రీడారంగ అభివృద్ధిపై మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోందని, ఇందులో 8 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చామని, పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మెస్సీ తన అభిమాన క్రీడాకారుడని, గతంలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా కూడా తన అభిమాన ఆటగాడని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.