Mahaa Daily Exclusive

  బహిరంగ విమర్శలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు!

Share

బహిరంగ విమర్శలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు!
* ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కఠిన హెచ్చరిక.
* మంచి ఉంటే మైక్‌లో చెప్పండి.. చెడు ఉంటే నా చెవిలో చెప్పండంటూ హితవు.
* ఎల్‌నినో కరవును ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్ల సాయం కోరుతూ పీఏసీ తీర్మానం.
* ఓట్ల తొలగింపుపై ఆందోళన.. సంక్రాంతి తర్వాత 5 నెలల పాటు ‘ప్రజాబలం’.

హైదరాబాద్‌, మహా.

పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలు, అసంతృప్తులు ఉంటే నాలుగు గోడల మధ్యే చర్చించుకోవాలని, వీధుల్లోకి వచ్చి విమర్శలు చేయడం ద్వారా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దని స్పష్టం చేశారు. ఇటీవల లక్ష్మణ రేఖ దాటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలను ఈ ఒక్కసారికి హెచ్చరికతో వదిలేద్దామని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే క్రమశిక్షణ చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.

గాంధీభవన్‌లో పీఏసీ భేటీ.. రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై చర్చ.

నూతన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్‌కుమార్‌ మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరుల సమక్షంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసిన వ్యాఖ్యలపై పలువురు సీనియర్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చర్యలకు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో స్పందించిన సీఎం.. “పార్టీలో పనిచేసేవారికంటే ఉచిత సలహాలు ఇచ్చేవారే ఎక్కువయ్యారు. మంచి విషయాలు మైక్‌లో చెప్పండి.. చెడు విషయాలు నా చెవిలో చెప్పండి” అంటూ హితవు పలికారు. తన వల్లగానీ, మంత్రుల వల్లగానీ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఎన్నికల వరకు ఇన్‌చార్జిగా కొనసాగే సందీప్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లాలని, కూర్చుని పరిష్కరించుకుందామని సూచించారు. అధిష్ఠానం ఆదేశాలను నూరుశాతం పాటిస్తూ మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, రాజగోపాల్‌రెడ్డిని సోమవారం (నవంబర్‌ 23న) నేరుగా సమావేశం కావాలని సందీప్‌కుమార్‌ ఆదేశించినట్లు తెలిసింది.

ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన.. రూ.30 వేల కోట్ల సాయం కోరుతూ తీర్మానం.

ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకొన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే ఎనిమిది నెలల పాటు తాగునీటి అవసరాలు అత్యంత కీలకం కానున్నందున ప్రాజెక్టుల్లోని జలాలను ప్రాధాన్యతా క్రమంలో తాగునీటికే వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్‌నినో, కరవు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణకు తక్షణమే రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పీఏసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరోవైపు, ఏపీలో పల్నాడు వాటర్‌ గ్రిడ్‌, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు అనుమతులు 2022లో కేసీఆర్‌, జగన్‌ హయాంలోనే జరిగాయని, తాము అధికారంలోకి వచ్చాక ఏపీలో ఒక్క కొత్త ప్రాజెక్టునూ చేపట్టలేదని సీఎం స్పష్టం చేశారు.

ఓట్ల తొలగింపుపై ఆందోళన.. ‘జ్ఞానేశ్‌కుమార్‌ గో బ్యాక్‌’ పిలుపు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు హక్కు కల్పించే ప్రక్రియను ఇప్పుడు ఓట్ల తొలగింపునకు ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని, భవిష్యత్తులో 20 కోట్ల ఓట్లు తీసేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వలసల పేరుతో తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని, ఇంటిపేర్లు సరిగా లేకపోయినా యాంత్రికంగా దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. బ్రిటిష్‌ కాలం నాటి సైమన్‌ కమిషన్‌ తరహాలో వందేళ్ల తర్వాత మోదీ సర్కార్‌ ‘సర్‌’ను తీసుకొచ్చిందని, ‘సైమన్‌ కమిషన్‌ గో బ్యాక్‌’ నినాదంలాగే ‘జ్ఞానేశ్‌కుమార్‌ (సీఈసీ) గో బ్యాక్‌’ నినాదంతో పోరాడాలని పిలుపునిచ్చారు. 2027లో కేంద్రం చేపట్టే జనగణనలో ఓబీసీ కులగణనను చేర్చాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాయాలని పీసీసీ చీఫ్‌కు సూచించారు.

సంక్రాంతి తర్వాత ఐదు నెలల పాటు ‘ప్రజాబలం’.

పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సంక్రాంతి పండుగ తర్వాత ఐదు నెలల పాటు ‘ప్రజాబలం’ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని, బూత్‌ స్థాయి ఏజెంట్లు ఓటర్ల జాబితాలపై డేగకన్ను వేయాలని దిశానిర్దేశం చేశారు. నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు.