Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక…

Share

  • హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక
  • పోలీసుల అప్రమత్తం
  • 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్‌
  • కాచిగూడ హోటల్‌, రైల్వే స్టేషన్‌ లక్ష్యంగా బాంబు దాడుల హెచ్చరిక

హైదరాబాద్‌, మహా : నగరంలో 26/11 ముంబయి తరహా ఉగ్రదాడులు జరుపుతామంటూ పోలీసులకు బెదిరింపు ఈ-మెయిల్‌ రావడం కలకలం రేపింది. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్‌లో కాచిగూడలోని హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడతామని హెచ్చరించినట్లు సమాచారం. పేలుళ్లతో 300 మందిని హతమారుస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది.

తమ నేత లతీఫ్‌ భట్‌తో పాటు ఇతర సహచరుల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఈ మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నవంబరు 21న హైదరాబాద్‌ ప్రత్యేక విభాగం భద్రతా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, జోన్ల డీసీపీలను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను పెంచాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ ముమ్మరం చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, గుర్తుతెలియని వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కీలక ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువుల తనిఖీలు చేపట్టాలని, ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించినట్లు సమాచారం.