80 వేల చదరపు మీటర్లలో గ్లోబల్ సమ్మిట్.
• తెలంగాణకు ప్రపంచ పెట్టుబడుల పండుగ.
• వెయ్యికి పైగా కంపెనీలతో భారీ ఎక్స్‌పో.
• డిసెంబర్ 7 నుంచి పెట్టుబడుల మహోత్సవం.
• ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష.
హైదరాబాద్, మహా:
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద బహుళ రంగాల ఎక్స్‌పోగా ఈ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమ్మిట్ వేదిక, ప్రదర్శనశాలలు, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, భద్రత, కార్యక్రమాల నిర్వహణపై సీఎం సమీక్షించారు. వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ప్రవేశ ప్రక్రియ సులభతరం చేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను వినియోగించాలని సూచించారు.
ఎనిమిది ప్రత్యేక ప్రదర్శనలు
సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను ప్రధానంగా ప్రదర్శించనున్నారు. ఆహ్వానాల నుంచి అతిథులకు స్వాగతం పలికే వరకు ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విధుల్లో ఉండే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులకు అప్పగించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించనున్నారు.
తెలంగాణ వైభవం.. భవిష్యత్ ప్రణాళికల ప్రదర్శన
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క-సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ చిత్రకళ, భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులు, చేనేత ప్రత్యేకతలను తెలంగాణ పెవిలియన్‌లో ప్రతిబింబించాలని సీఎం సూచించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంతో పాటు గాంధీ సరోవర్ వంటి భవిష్యత్ ప్రణాళికలను ప్రదర్శించాలన్నారు.
రక్షా ఎక్స్‌పోలో భాగంగా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, ఎయిర్ షో నిర్వహించనున్నారు. వీటిని వీక్షించే అవకాశం ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కల్పించాలని సీఎం సూచించారు. క్లైమేట్ కాంక్లేవ్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు ప్రసంగించనున్నారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయడంతో పాటు హరిత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులపై చర్చలు నిర్వహించనున్నారు.
విద్య, యానిమేషన్ రంగాలకు అంతర్జాతీయ వేదిక
ఎడ్యుకేషన్ ఎక్స్‌పోలో యూకే, యూరోపియన్ పెవిలియన్లతో పాటు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఐఎస్‌బీ, ఐఐటీ హైదరాబాద్, నల్సార్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సహా రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలు అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చలు జరపనున్నాయి. డిసెంబర్ 7న ‘స్కూల్స్ ఆఫ్ ది ఫ్యూచర్’, డిసెంబర్ 8న ‘రిఫార్మ్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్’ అంశాలపై జరిగే చర్చల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ఇండియా జాయ్–2026లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలకు చెందిన సుమారు 150 కంపెనీలు పాల్గొననున్నాయి. అడోబ్, సోనీ, ఉబిసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాంకేతికత, ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, పరిశ్రమలు, నైపుణ్యాలు, సాంకేతికతను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా సమ్మిట్‌ను విజయవంతం చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.








