Mahaa Daily Exclusive

  కంటోన్మెంట్‌ బోర్డులో అవినీతి కలకలం!

Share

కంటోన్మెంట్‌ బోర్డులో అవినీతి కలకలం!
* టౌన్‌ ప్లానింగ్‌ అక్రమాలపై సీబీఐ విచారణ.
* మూడేళ్ల అనుమతులపై ఆరా

సికింద్రాబాద్‌, మహా:

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బోర్డులోని టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ అందిన ఫిర్యాదులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేపట్టింది. గత వారం రోజులుగా అధికారులు ఫిర్యాదుల్లోని అంశాలను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల జారీ, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల వ్యవహారంపై దృష్టి సారించారు.

గత మూడేళ్లలో కంటోన్మెంట్‌ బోర్డు జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన రికార్డులను సీబీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొందరు అధికారులు బిల్డర్లతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఫిర్యాదుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతుల్లో పేర్కొన్న వివరాలకు, క్షేత్రస్థాయిలో చేపట్టిన నిర్మాణాలకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా? నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణాలకు అధికారులు సహకరించారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు, ఆమోదించిన ప్రణాళికలు, క్షేత్రస్థాయి నిర్మాణాల వివరాలు, సంబంధిత అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఫిర్యాదుల్లో పేర్కొన్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? నిబంధనల ఉల్లంఘనలో ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే అంశాలను సీబీఐ పరిశీలిస్తోంది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.