Mahaa Daily Exclusive

  హే రామ్‌.. ఆలయాలను కాపాడండి.. ఏపీని రక్షించండి!

Share

హే రామ్‌.. ఆలయాలను కాపాడండి.. ఏపీని రక్షించండి!
* అంజనేయపురం అభయ ఆంజనేయస్వామి ఆలయ కూల్చివేతపై జగన్‌ ఆగ్రహం.

అమరావతి, మహా:

తిరుపతి జిల్లాలో పురాతన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేయడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆలయాలపై విధ్వంసకాండ కొనసాగుతోందని విమర్శించారు. ‘‘హే రామ్‌.. ఆలయాలను కాపాడండి.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’’ అంటూ సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

రేణిగుంట మండలం అంజనేయపురంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్రంగా కలచివేసిందని జగన్‌ పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన పవిత్ర స్థలాలను కూల్చివేయడం బాధాకరమన్నారు. తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపం తొలగింపు, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాల కూల్చివేత, బద్వేల్‌లోని కాశీనాయన జ్యోతి క్షేత్రం వ్యవహారాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

తమ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేశామని జగన్‌ పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక ఆలయాలను బుల్డోజర్లతో తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగింపు

కడప–రేణిగుంట జాతీయ రహదారి 716 విస్తరణ పనుల్లో భాగంగా అంజనేయపురంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ చర్యపై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. రహదారి మార్గాన్ని మార్చే అవకాశం ఉన్నప్పటికీ ఆలయాన్ని తొలగించారని ఆయన ఆరోపించారు. ఆలయానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సిందని పేర్కొన్నారు.