ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు రెరా గుర్తింపు!
* ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు తొలిసారి అనుమతులు.
* తొలి విడతలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్‌కు ఆమోదం.
హైదరాబాద్, మహా:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ప్రాజెక్టులకు తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ (రెరా) అనుమతులు మంజూరు చేసింది. హౌసింగ్ బోర్డు చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా గుర్తింపు లభించిందని అధికారులు వెల్లడించారు. తొలి విడతలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో చేపట్టిన టవర్స్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ రెరా అనుమతి పత్రాలను అందుకున్నారు.
హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని వీపీ గౌతమ్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా 20 నియోజకవర్గాల్లో 12 వేల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలోగా నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
రూ.6 లక్షలకే పేదలకు ఫ్లాట్లు
బహిరంగ మార్కెట్‌లో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువ చేసే ఫ్లాట్లను అర్హులైన పేదలకు కేవలం రూ.6 లక్షలకే అందించనున్నట్లు గౌతమ్ వివరించారు. ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయించడంతోపాటు ఫ్లాట్లపై అవిభక్త భూమి వాటాను కూడా లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయనుందని తెలిపారు.
పారదర్శకతకు రెరా భరోసా
ప్రభుత్వం ఇచ్చిన హామీలకు రెరా అనుమతులు చట్టబద్ధమైన భరోసా కల్పిస్తాయని గౌతమ్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత, నాణ్యత పాటించడంతోపాటు లబ్ధిదారుల హక్కులకు రక్షణ కల్పించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందన్నారు. రెరా అనుమతులతో బ్యాంకుల నుంచి రుణాలు పొందే ప్రక్రియ కూడా వేగవంతమవుతుందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుల ద్వారా నగర పరిధిలో సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు అందుబాటు ధరలో నివాస సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు వెల్లడించారు.








