Mahaa Daily Exclusive

  భారీ డిస్కౌంట్ల ముసుగులో సైబర్‌ వల!

Share

భారీ డిస్కౌంట్ల ముసుగులో సైబర్‌ వల!
* బ్లాక్‌ ఫ్రైడే ఆఫర్లపై అప్రమత్తంగా ఉండండి.
* టీజీసీఎస్‌బీ హెచ్చరిక.

హైదరాబాద్‌, మహా:

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ పేరుతో ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ సైబర్‌ నేరగాళ్లు వినియోగదారులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) హెచ్చరించింది. ఆకర్షణీయమైన ఆఫర్లు, నమ్మశక్యం కాని ధరలతో నకిలీ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలకు వల వేస్తున్నారని తెలిపింది. పండుగలు, ప్రత్యేక విక్రయాల సమయంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నకిలీ వెబ్‌సైట్లలో ప్రముఖ సంస్థల పేర్లు, లోగోలు ఉపయోగించి అసలైన విక్రయ వేదికల మాదిరిగా సైబర్‌ నేరగాళ్లు వెబ్‌పేజీలు రూపొందిస్తున్నారని అధికారులు తెలిపారు. తక్కువ ధరకే ఖరీదైన వస్తువులు లభిస్తాయంటూ ప్రకటనలు ఇస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆ లింకుల ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టినప్పుడు వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, కార్డు సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఓటీపీ, యూపీఐ పిన్‌ ఎవరికీ చెప్పొద్దు

ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను తెరవొద్దని టీజీసీఎస్‌బీ సూచించింది. గుర్తింపు లేని వెబ్‌సైట్లలో వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతా భద్రతకు సంబంధించిన ఓటీపీ, యూపీఐ పిన్‌, సీవీవీ నంబర్లను ఎవరికీ వెల్లడించరాదని పేర్కొంది. తెలియని వ్యక్తులు పంపే క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయొద్దని, ఆఫర్ల పేరుతో ముందస్తు చెల్లింపులు చేసే ముందు విక్రేత విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని సూచించింది.

అధికారిక వేదికల ద్వారానే కొనుగోళ్లు

ఆన్‌లైన్‌ కొనుగోళ్ల కోసం గుర్తింపు పొందిన, నమ్మకమైన ఈ-కామర్స్‌ వేదికలను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. వెబ్‌సైట్‌ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలని, అసాధారణంగా తక్కువ ధరలు, తొందరపెట్టి చెల్లింపులు చేయించే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, cybercrime.gov.in వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు నమోదు చేయాలని టీజీసీఎస్‌బీ అధికారులు సూచించారు.