- భారీ ఊయల తగిలి బాలుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో జరిగిన స్కూల్ పిక్నిక్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లోటస్ పాండ్ పార్క్‌లో ఆడుకుంటుండగా భారీ ఇనుప ఊయల తగిలి పదేళ్ల బాలుడు అభిరామ్ మృతి చెందగా, మరో విద్యార్థి యశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే, పాఠశాల తరఫున పిక్నిక్కు వెళ్లిన విద్యార్థులు పార్క్‌లోని భారీ ఇనుప ఊయలపై ఆడుకుంటున్నారు. ఊయలపై సుమారు 10 మంది పిల్లలు కూర్చుని ఉండగా, వెనుక నుంచి మరో నలుగురు వేగంగా ఊపారు. ఈ క్రమంలో ఊయల అదుపుతప్పి వెనక్కి వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నుదురు, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలైన అభిరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన యశ్వంత్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది అక్కడ పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా లోపాల వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన బయటకు పొక్కకుండా యాజమాన్యం వ్యవస్థలను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ, బాధ్యులైన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.








