- విభజన ప్రతిపాదనపై భగ్గుమన్న నిరసనలు
కరాచీ, మహా.
పాకిస్థాన్‌లో మరోసారి వేర్పాటువాద ఉద్యమం కలకలం రేపుతోంది. దేశంలోని నాలుగు ప్రధాన ప్రావిన్సులను చిన్న పరిపాలనా విభాగాలుగా విభజించాలన్న ప్రతిపాదన సింధ్ ప్రాంతంలో తీవ్ర నిరసనలకు దారితీసింది. సింధ్ భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే కుట్రలను సహించబోమంటూ వేలాది మంది జాతీయవాదులు రోడ్డెక్కారు. ఈ ప్రతిపాదన వెనుక పాకిస్థాన్ సైనికాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఉన్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సింధ్‌కు ప్రత్యేక స్వతంత్ర దేశ హోదా కల్పించాలన్న పాత డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌పై ఆర్థిక దిగ్బంధం విధిస్తామని వేర్పాటువాద సంస్థలు హెచ్చరించడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.
సింధ్ విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నవంబర్ 22న కరాచీలో జియే సింధ్ రహబర్ కమిటీ (జేఎస్ఆర్సీ) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఎర్రజెండాలు చేతబూనిన వేలాది మంది జాతీయవాదులు ర్యాలీలో పాల్గొన్నారు. నాలుగు సింధీ జాతీయవాద పార్టీల కూటమిగా ఉన్న ఈ సంస్థ నిర్వహించిన ప్రదర్శనకు జియే సింధ్ మహాజ్ అధ్యక్షుడు రియాజ్ అలీ చాండియో, నియాజ్ కలానీ తదితర నాయకులు నేతృత్వం వహించారు. న్యాయవాదులు, పౌర సమాజ ప్రతినిధులు సైతం మద్దతుగా నిలిచారు. భారీ ప్రదర్శన నేపథ్యంలో నగరంలోని పలు ప్రధాన రహదారులను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. కొత్త ప్రావిన్సుల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్న ప్రతిపాదనను నిరసనకారులు తిరస్కరించారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు ప్రజామోదం పొందేందుకు ప్రజాభిప్రాయ సేకరణను వాడుకునే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తమ ఉద్యమం ఉర్దూ మాట్లాడే ప్రజలకు, ఇతర జాతుల సమూహాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సింధ్ భౌగోళిక సరిహద్దుల మార్పుపై నిర్ణయం తీసుకునే హక్కు అక్కడి ప్రజలకే ఉండాలని డిమాండ్ చేశారు. కరాచీతో పాటు హైదరాబాద్, నవాబ్షా, లర్కానా నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. దాదు జిల్లాలోని మెహర్ పట్టణంలో నవంబర్ 21న ఆందోళన చేపట్టారు. జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ పార్టీ కూడా కరాచీ, సుక్కూర్, జాకోబాబాద్ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించింది.
సింధ్ జాతీయవాద నాయకులు పాకిస్థాన్ సైనిక వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పంజాబ్ ఆధిపత్యంలోని పాలక వ్యవస్థ సింధ్ భౌగోళిక సమగ్రతను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రావిన్స్‌లోని లక్షల ఎకరాల వ్యవసాయ భూములు, తీర ప్రాంత ద్వీపాలు, చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి సహజ వనరులపై పాలక వ్యవస్థ నియంత్రణ పెంచుకుంటోందని ఆరోపించారు. జియే సింధ్ ముత్తహిదా మహాజ్ (జేఎస్ఎంఎం) వేర్పాటువాద సంస్థ కూడా ఈ నిరసనల్లో పాల్గొని, పంజాబ్‌పై ఆర్థిక దిగ్బంధం విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. సింధ్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమాన్ని సంపూర్ణ స్వాతంత్ర్య పోరాటంగా విస్తరిస్తామని వెల్లడించింది. జర్మనీలో నివసిస్తున్న ఆ సంస్థ అధ్యక్షుడు షఫీ మహమ్మద్ బర్ఫత్ మాట్లాడుతూ, సింధ్ పాకిస్థాన్‌లో అంతర్భాగం కాదని, సింధీ ప్రజల మాతృభూమికి స్వాతంత్ర్యం కల్పించే విషయంలో అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి మద్దతు ఇవ్వాలని కోరారు.
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్‌లో చిన్న పరిపాలనా విభాగాల ఏర్పాటును ప్రస్తావించడంతో ఈ వివాదం మొదలైంది. ప్రస్తుతం పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్ అనే నాలుగు ప్రావిన్సులు ఉండగా, వాటి సంఖ్యను 12 నుంచి 15కు పెంచే ఆలోచనను ప్రణాళికా శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ప్రస్తావించారు. ప్రజాభిప్రాయ సేకరణపై చర్చలు 2026 చివరి నాటికి ఒక స్పష్టమైన రూపం దాల్చవచ్చని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నవంబర్ 22న పేర్కొన్నారు. అయితే కొత్త ప్రావిన్సులకు సంబంధించి అధికారిక పటాలు, రాజ్యాంగ సవరణ ముసాయిదా ఇప్పటివరకు వెల్లడికాలేదు.
సింధ్ విభజన ప్రతిపాదనను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బలవంతంగా ప్రావిన్స్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు ఆయుధాలు పట్టుకునే పరిస్థితి వస్తుందని, రక్తపాతం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజల అభీష్టం మేరకు కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, బలవంతపు విభజననే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. 2008 నుంచి సింధ్‌లో అధికారంలో ఉన్న పీపీపీకి ఈ విభజన రాజకీయంగా, ఆర్థికంగా నష్టదాయకమనే ఆందోళన ఉంది. మరోవైపు పాలక కూటమిలో భాగస్వామిగా ఉన్న ముత్తహిదా ఖౌమీ మూవ్మెంట్-పాకిస్థాన్ (ఎంయూక్యూఎం-పీ) మాత్రం కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తోంది. దీంతో ప్రభుత్వ కూటమిలోనూ విభేదాలు బయటపడుతున్నాయి.
సింధ్‌కు ప్రత్యేక దేశ హోదా కల్పించాలన్న డిమాండ్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన అనంతరం సింధీ జాతీయవాద నాయకుడు జీఎం సయ్యద్ ఈ డిమాండ్‌ను బలంగా ముందుకు తీసుకొచ్చారు. ప్రత్యేక భాష, సంస్కృతి, చరిత్ర, నాగరికత కలిగిన సింధ్ తన స్వతంత్ర గుర్తింపును కాపాడుకోవాలన్నది ఈ ఉద్యమ ప్రధాన వాదన. ఈ నేపథ్యంలో నవంబర్ 29న కరాచీలో మరో భారీ ప్రదర్శన నిర్వహించాలని సింధీ జాతీయవాద సంస్థలు నిర్ణయించాయి. అదే రోజు కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు మద్దతుగా ఎంయూక్యూఎం-పీ కూడా ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకే రోజు పరస్పర భిన్న వైఖరులు కలిగిన సంస్థలు పోటాపోటీ ప్రదర్శనలకు దిగనుండటంతో కరాచీలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశముంది.








