- కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ పై బీఆర్ఎస్ దాడికి యత్నం
- ఇరువర్గాల నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- కాంగ్రెస్ నేతలను విడిపించిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల
హనుమకొండ, మహా ;
హనుమకొండ నగర అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలు విసిరిన సవాల్‌ను స్వీకరించి హనుమకొండ చౌరస్తాకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేసేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకునే క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా, ఎలాంటి అల్లర్లు చెలరేగకూడదనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన కాంగ్రెస్ నేతలలో కొందరిని కేయూ పోలీస్ స్టేషన్‌కు, మరికొందరిని హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కేయూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, అక్కడున్న కాంగ్రెస్ నాయకులను సొంత పూచికత్తుపై విడిపించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతలు తీరా సమయానికి ముఖం చాటేసి, కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్‌పై దాడికి యత్నించడం సిగ్గుచేటు అని వారి పిరికిపంద చర్యకు ఇది నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు అవాస్తవ ఆరోపణలు చేస్తూ దాడులకు తెగబడుతున్నారని, ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.








