క్రీడా తెలంగాణకు ఖేలో ఇండియా బలమైన పునాది!
* డిసెంబర్ 11 నుంచి 22 వరకు యూత్ గేమ్స్.
* రూ.203 కోట్లతో ప్రపంచస్థాయి ఏర్పాట్లు.
* 27 క్రీడల్లో యువ క్రీడాకారుల ప్రతిభకు వేదిక.
* కర్రసాముకు తొలిసారి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు.
* సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మహా:
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ కీలక మైలురాయిగా నిలవనున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలకు తెలంగాణ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనుండటం రాష్ట్ర క్రీడా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఈ పోటీలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 11న యువతలో నూతన ఉత్సాహాన్ని నింపేలా ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు. ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో, ముగింపు వేడుకలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. నగరమంతా క్రీడా స్ఫూర్తి ప్రతిబింబించేలా అలంకరణలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టేడియాల అభివృద్ధి
క్రీడల నిర్వహణ కోసం స్టేడియాల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, నిధుల వినియోగంలో పారదర్శకత కోసం విజిలెన్స్ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రారంభ, ముగింపు వేడుకల నిర్వహణ బాధ్యతలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లోనూ పోటీలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను ఇన్చార్జిలుగా నియమించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లాకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మహబూబ్‌నగర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు, వరంగల్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఖమ్మంకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డిని బాధ్యులుగా నియమించారు. ఆయా ప్రాంతాల్లో పోటీల నిర్వహణ, వసతులు, క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాల కల్పనను వీరు పర్యవేక్షించనున్నారు.
జాతీయ వేదికపై తెలంగాణ కర్రసాము
ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ అయిన కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యమంత్రి సూచన మేరకు తొలిసారిగా దీనిని ప్రదర్శన క్రీడగా చేర్చుతున్నారు. ఈ సందర్భంగా కర్రసాముకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణకు చెందిన సంప్రదాయ యుద్ధకళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతోపాటు రాష్ట్రంలో ఈ కళను అభ్యసిస్తున్న యువతకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంప్రదాయ క్రీడలను ఆధునిక క్రీడా వేదికలతో అనుసంధానించడం ద్వారా వాటి ప్రాచుర్యాన్ని మరింత పెంచవచ్చన్నారు.
రూ.203 కోట్లతో భారీ ఏర్పాట్లు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.203 కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21 కోట్లు కేటాయించింది. స్టేడియాల అభివృద్ధి, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాల కల్పన, అత్యాధునిక క్రీడా పరికరాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లు వెచ్చిస్తోంది. తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం కాకుండా భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా శాశ్వత క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ నెలాఖరులోగా స్టేడియాలకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు 27 క్రీడలకు అవసరమైన పరికరాలన్నీ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 14 స్టేడియాల్లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఆరు స్టేడియాల్లో పనులను నెలాఖరులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
1,334 మంది క్రీడాకారులకు శిక్షణ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచేలా ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 27 క్రీడా విభాగాలకు సంబంధించి 1,334 మంది తెలంగాణ క్రీడాకారులకు శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రం తరఫున పోటీల్లో పాల్గొనే 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ, అవసరమైన పరికరాలు, వసతి, రవాణా సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.
క్రీడా రంగంలో తెలంగాణకు కొత్త దిశ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణను రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి దీర్ఘకాలిక అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ స్థాయి పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణలోని క్రీడా మౌలిక సదుపాయాలు బలోపేతం కావడంతోపాటు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాల అభివృద్ధి, అత్యాధునిక పరికరాల సమకూర్పు, సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం వంటి చర్యలు భవిష్యత్తులో రాష్ట్రాన్ని ప్రముఖ క్రీడా కేంద్రంగా నిలబెట్టేందుకు దోహదపడనున్నాయి.
డిసెంబర్ 11న ప్రారంభమై 22న ముగియనున్న ఈ క్రీడా సంబరాలను విజయవంతం చేయడంతోపాటు తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.








