గ్రాడ్యుయేట్ ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల.
• రెండు నియోజకవర్గాల్లో 11.89 లక్షల దరఖాస్తులకు ఆమోదం.
• 80,635 తిరస్కరణ.
హైదరాబాద్, మహా:
తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు ప్రచురించారు. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల పరిధిలో ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన, తిరస్కరించిన వివరాలను వెల్లడించారు.
మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొత్తం 5,99,419 దరఖాస్తులు అందాయి. వీటిలో 5,68,105 దరఖాస్తులను అధికారులు ఆమోదించగా, 31,314 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 156 మండలాల్లో ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసి ముసాయిదా జాబితాను ప్రచురించారు.
వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 6,70,407 దరఖాస్తులు అందగా, వాటిలో 6,21,086 దరఖాస్తులకు ఆమోదం లభించింది. మరో 49,321 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 192 మండలాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు.
రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 12,69,826 దరఖాస్తులు అందగా, 11,89,191 దరఖాస్తులను ఆమోదించారు. వివిధ కారణాలతో 80,635 దరఖాస్తులను తిరస్కరించారు. ముసాయిదా జాబితా ప్రచురణతో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది.








