Mahaa Daily Exclusive

  వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం….

Share

వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం.
* మారేడుమిల్లి అడవుల్లో 69 వేట ఉచ్చులు తొలగింపు.
* అటవీ గస్తీని మరింత పటిష్ఠం చేయాలి.
* బ్రేక్‌ వైర్ల దుర్వినియోగంపై మెకానిక్‌లకు అవగాహన కల్పించాలి.
* ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌.

అమరావతి, మహా:

అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో అక్రమ వేటను అరికట్టేందుకు అటవీ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో 69 వేట ఉచ్చులను గుర్తించి తొలగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీని మరింత పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం మారేడుమిల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్‌ నంబర్‌ 26/4లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పెట్రోలింగ్‌ నిర్వహించారు. వన్యప్రాణులను అక్రమంగా వేటాడేందుకు మూడు చక్రాల వాహనాల బ్రేక్‌ వైర్లతో ఏర్పాటు చేసిన 69 ఉచ్చులను గుర్తించారు. వాటిని తొలగించి వన్యప్రాణులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారులు, ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు, యానిమల్‌ ట్రాకర్లు, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది కృషిని ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు.

అడవుల్లో నిరంతర గస్తీ, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత, సమష్టి కృషి వల్ల అనేక వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తప్పిందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అక్రమ వేటను నిరోధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్రేక్‌ వైర్లతో వేట ఉచ్చుల తయారీని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆటోమొబైల్‌ షాపుల యజమానులు, మోటార్‌ మెకానిక్‌లకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అడవుల్లో అమర్చే ప్రతి ఉచ్చు ఒక వన్యప్రాణి ప్రాణానికి ముప్పుగా మారుతుందని, వాటిని గుర్తించి తొలగించడం జీవవైవిధ్య పరిరక్షణలో కీలకమైన సేవ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్‌ వంటి చర్యలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని అటవీ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.