Mahaa Daily Exclusive

  బాలల రక్షణ.. మహిళల భద్రతపై అవగాహన!

Share

*బాలల రక్షణ.. మహిళల భద్రతపై అవగాహన!

* విద్యార్థినులకు బాల్యవివాహాలు, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన

* బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. ఆపద సమయంలో హెల్ప్‌లైన్‌ సేవలను వినియోగించుకోవాలి

ఖమ్మం, నవంబరు 25: మహా

బాలల రక్షణ, మహిళల భద్రతపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ఏ. ప్రమీల ఆదేశాల మేరకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఎంజేపీటీబీసీ సంక్షేమ బాలికల జూనియర్‌ కళాశాల, టీఎంఆర్‌జేసీ గర్ల్స్‌-1, టీఎంఆర్‌జేసీ-2 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌) బోయల సోనీ ప్రేమలీన విద్యార్థినులకు బాలల హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టాలు, ప్రభుత్వ సహాయ సేవలపై వివరించారు. బాల్యవివాహాల నిర్మూలన, బాల్యవివాహ నిషేధ చట్టం, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఇంటర్నెట్‌ దుర్వినియోగం, బాలల అక్రమ రవాణా వంటి అంశాలను వివరించారు. బాలలపై జరిగే లైంగిక, శారీరక వేధింపులను గుర్తించడం, వాటి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయ సేవలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో బాలల సహాయం కోసం 1098, మహిళల సహాయం కోసం 181, అత్యవసర సేవల కోసం 112, పోలీసు సహాయం కోసం 100 నంబర్లను సంప్రదించాలని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని, బాలలపై ఎలాంటి వేధింపులు జరిగినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవడంతోపాటు ఆపద సమయంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కళాశాలల ప్రిన్సిపాళ్లు శ్రావణి, అఖిల, సీతామహాలక్ష్మితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.