Mahaa Daily Exclusive

  దురదపాడులో పోలీసుల మెరుపు కార్డన్ సెర్చ్.. 101 ఇళ్లలో తనిఖీలు

Share

  • దురదపాడులో పోలీసుల మెరుపు కార్డన్ సెర్చ్.. 101 ఇళ్లలో తనిఖీలు
  •  75 వాహనాల పత్రాలను పరిశీలించిన పోలీసులు
  • గంజాయి, పేకాట, కోడిపందేలపై హెచ్చరికలు
  • డ్రగ్స్ రహిత గ్రామ నిర్మాణానికి ప్రజల ప్రతిజ్ఞ

అశ్వారావుపేట, నవంబర్ 25, (మహా) : దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దురదపాడు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు మెరుపు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 101 ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు 75 వాహనాల పత్రాలను పరిశీలించారు.

జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ఆదేశాలు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్‌హెచ్‌ఓ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు గ్రామంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. 67 ద్విచక్ర వాహనాలు, 5 ప్యాసింజర్ ఆటోలు, 2 ట్రాక్టర్లు, ఒక బొలెరో వాహనం కలిపి మొత్తం 75 వాహనాల పత్రాలను తనిఖీ చేసి ధృవీకరించారు.

అనంతరం గ్రామస్తులతో సమావేశమైన పోలీసులు గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పేకాట, కోడిపందేలు, మూఢనమ్మకాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఎదురయ్యే నష్టాలపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతా నియమాలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో గంజాయి వినియోగం లేదా అక్రమ రవాణా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరిస్తామని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందిస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ బాలస్వామి, అశ్వారావుపేట ఎస్ఐ దేవ్ సింగ్, సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.