Mahaa Daily Exclusive

  నారీ శక్తిని ఎవరూ ఆపలేరు..! మహిళా రిజర్వేషన్‌కు అడ్డంకులన్నీ తొలగిస్తాం..:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

Share

  • నారీ శక్తిని ఎవరూ ఆపలేరు!
  • మహిళా రిజర్వేషన్‌కు అడ్డంకులన్నీ తొలగిస్తాం.
  • బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతికి సిఫార్సు.
  • ఎన్నికల లబ్ధి కోసమేనని విపక్షాల విమర్శలు.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

న్యూఢిల్లీ, మహా.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ అమలుకు ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ తొలగించి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నాలను ఏ రాజకీయ పార్టీ కూడా అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు. నవంబరు 30 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నారీ శక్తి సాధికారత విషయంలో తమ సంకల్పం చెక్కుచెదరదని ఆయన పునరుద్ఘాటించారు.
మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఈ లక్ష్యం కోసం తాను కూడా ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నానని ప్రధాని మోదీ తన సందేశంలో గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అనేకమంది మహిళలు ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని, ఎందరో సోదరీమణులు లేఖల ద్వారా తమ ఆకాంక్షలను తెలియజేశారని చెప్పారు. దేశంలోని వంద శాతం నారీ శక్తి ఆశీస్సులు తమకు ఉన్నాయని, మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇచ్చేవారి ఉత్సాహం, ధైర్యం, సంకల్పం దృఢంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు పార్లమెంట్‌, శాసనసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగకుండా ఎప్పటికీ నిలువరించలేవని, అది కేవలం సమయం మాత్రమేనని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
రంగం సిద్ధం చేసిన కేంద్రం.. రాష్ట్రపతి ఆమోదముద్ర
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ను త్వరితగతిన అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియతో కూడిన కొత్త శాసన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇటీవలే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సవరించిన డీలిమిటేషన్‌ (రెండవ) బిల్లు, 2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 117(3) కింద తన సిఫార్సును అందించారు. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాల కొనసాగింపుగా నవంబరు 30 నుంచి డిసెంబరు 3 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా లోక్‌సభ నవంబరు 30న, రాజ్యసభ డిసెంబరు 2న సమావేశం కానున్నాయి.
850కి లోక్‌సభ స్థానాలు.. 2051 వరకు పాత నిష్పత్తి
ప్రతిపాదిత బిల్లుల ప్రకారం లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 550 నుంచి 850కి (రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35), రాష్ట్ర శాసనసభల గరిష్ఠ సభ్యుల సంఖ్యను 500 నుంచి 650కి పెంచాలని నిర్ణయించారు. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలతో పాటు 50 శాతం అదనపు స్థానాలు కల్పించనున్నారు. దీనివల్ల లోక్‌సభ ప్రస్తుత బలం 543 నుంచి సుమారు 815 స్థానాలకు పెరగనుంది. నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనకు 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకుంటూనే, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల ప్రస్తుత నిష్పత్తిని 1971 జనగణన ఆధారంగా 2051 తర్వాత జరిగే మొదటి జనగణన వరకు యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించారు. ఈ మార్పుల ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కేంద్రం భావిస్తోంది.

Latest