Mahaa Daily Exclusive

  డీలిమిటేషన్‌ బిల్లుకు డీఎంకే జై.. కాంగ్రెస్‌కు షాక్‌..! మోదీ మాస్టర్‌ ప్లాన్‌కు స్టాలిన్‌ మద్దతు..

Share

  • మోదీ మాస్టర్‌ ప్లాన్‌కు స్టాలిన్‌ మద్దతు.
  • తమిళనాడుకు ప్రస్తుతమున్న 7.18 శాతం వాటా కొనసాగింపు.
  • 39 నుంచి 59కి పెరగనున్న ఎంపీ స్థానాలు.
  • 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తికి రక్షణ.
  • ఎం.కె. స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే ఎంపీల కీలక సమావేశం.
  • బిల్లుకు మద్దతుగా పార్టీ నిర్ణయం

న్యూఢిల్లీ, మహా:

దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్‌ ప్రక్రియ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కీలక ప్రతిపాదనలకు తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే మద్దతు ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో అనూహ్య మలుపుగా మారింది. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం జరుగుతుందంటూ ఇప్పటివరకు కేంద్ర ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే.. తాజా సవరణలతో తమ రాష్ట్ర ప్రయోజనాలకు రక్షణ లభిస్తుందని భావించి బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత సంఖ్య కంటే 50 శాతం పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత జనగణనతో సంబంధం లేకుండా రాష్ట్రాల మధ్య ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగిస్తూ స్థానాల సంఖ్య పెంచాలన్నది ఈ ప్రతిపాదనలో ప్రధానాంశం. నవంబరు 30 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

స్టాలిన్‌ రెండు డిమాండ్లకు రక్షణ

డీలిమిటేషన్‌ విషయంలో డీఎంకే మొదటి నుంచీ రెండు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచుతోంది. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 39 లోక్‌సభ స్థానాల ద్వారా లభిస్తున్న 7.18 శాతం ప్రాతినిధ్య వాటా తగ్గకూడదనేది మొదటి డిమాండ్‌. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు జనాభా పెరుగుదల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజకీయంగా నష్టం జరుగుతుందని స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలనేది రెండో డిమాండ్‌.

తాజా ప్రతిపాదనల్లో అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం స్థానాల పెంపు, రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు కొనసాగించే అంశాలు ఉండటంతో డీఎంకే తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు ప్రయోజనాలకు రక్షణ లభిస్తుందని పార్టీ భావిస్తోంది.

చెన్నైలో కీలక భేటీ.. మద్దతుగా నిర్ణయం

శనివారం చెన్నైలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే ఎంపీల సమావేశం జరిగింది. కేంద్రం తీసుకురానున్న డీలిమిటేషన్‌ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. సమావేశం తర్వాత సీనియర్‌ నేత, ఎంపీ ఎ. రాజా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రానికి ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య వాటాకు భంగం కలగకుండా కేంద్రం ప్రతిపాదనలు రూపొందించిన నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

39 నుంచి 59కి తమిళనాడు ఎంపీ స్థానాలు?

ప్రస్తుతం తమిళనాడుకు 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం పెంపు ప్రతిపాదన అమలైతే తమిళనాడులో స్థానాల సంఖ్య సుమారు 59కు చేరనుంది. దేశవ్యాప్తంగా కూడా లోక్‌సభ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య వాటాను కొనసాగిస్తూ స్థానాలను పెంచడం ద్వారా ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యతను కాపాడాలన్నది కేంద్ర ప్రతిపాదనలోని కీలక ఉద్దేశం.

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 ఎన్నికల నాటికి అమలు చేయడానికి వీలుగా ఈ మార్పులు చేపడుతున్నట్లు కేంద్రం చెబుతోంది. అయితే ఈ ప్రతిపాదనల అమలుకు రాజ్యాంగ సవరణతోపాటు సంబంధిత చట్టపరమైన ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.

ఇండియా కూటమిలో కొత్త రాజకీయ సమీకరణాలు

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో డీఎంకే కీలక భాగస్వామిగా ఉంది. అలాంటి పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రతిపాదనలకు మద్దతు ప్రకటించడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. బిల్లును అడ్డుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు స్టాలిన్‌ నిర్ణయం రాజకీయంగా ఇబ్బందికర పరిణామం. మరోవైపు ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలను కాపాడేలా ప్రతిపాదనలు ఉన్నాయన్న వాదనతో డీఎంకే తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.

నవంబరు 30 నుంచి పార్లమెంటులో అసలు సమరం

కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లుపై పార్లమెంటులో జరిగే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. సంబంధిత రాజ్యాంగ నిబంధనల ప్రకారం అవసరమైన రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం కానుంది.

డీలిమిటేషన్‌ చుట్టూ సాగుతున్న రాజకీయ పోరులో డీఎంకే తీసుకున్న తాజా నిర్ణయం కేంద్రానికి బలాన్నిస్తుందా? కాంగ్రెస్‌ తన మిత్రపక్షాలను ఏకతాటిపైకి తీసుకురాగలదా? మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ స్థానాల పెంపు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య పరిరక్షణ అంశాలపై పార్లమెంటులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Latest